మలికిపురం గ్రామంలో అదృశ్యమైన పడమటి నోయెల్ జార్జ్ (19) అనే ఒక యువకుడు శవంగా తేలడంతో కలకలం రేగింది. ఈనెల 9 న చించినాడ బ్రిడ్జి వద్ద నుండి నన్ను కాపాడండి నాన్నా… బాబాయ్ అంటూ మృతుని చివరి కన్నీటి మాటలు కదిలిస్తున్నాయి.. ఇప్పుడు ఆ యువకుడు మృతదేహం బయట పడటంతో ఈ కేసులో పలు అంశాలను పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు.
అదే రోజున యువకుని దారుణంగా కొట్టి చంపేసి గోదావరిలో పడేసారని, ఇప్పుడు సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈనెల 13 న అంతర్వేది పల్లిపాలెం గోదావరి ఒడ్డున యువకుని మృతదేహం కనిపించడంతో మృతుని శరీరంపై ఉన్న గాయాలు ఆధారంగా మొదట నమోదు చేసిన మిస్సింగ్ కేసును, అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు.
ఇప్పటికే నిందితులు కొందరు పోలీసు కస్టడీలో ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. వివాహేతర సంబంధమే, యువకుడు మృతికి కారణంగా ప్రచారం జరుగుతోంది. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.