ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రాకా’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించి ఇప్పుడు ఈ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది.
‘మోస్ట్ పీపుల్ మోషన్-క్యాప్చర్డ్ ఇన్ రియల్-టైమ్’ విభాగంలో ‘రాకా’ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఒకేసారి ఏకంగా 37 మంది పెర్ఫార్మర్లతో రియల్‌టైమ్ మోషన్ క్యాప్చర్‌ను చిత్రీకరించి ఈ రికార్డ్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ చారిత్రాత్మక ఘనతకు సంబంధించిన గిన్నిస్ సర్టిఫికెట్‌ను అల్లు అర్జున్, అట్లీ అందుకున్న ఫొటోలను సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు.. దర్శకుడు అట్లీ పుట్టినరోజు రోజే ఈ రికార్డ్ అనౌన్స్మెంట్ రావడం మరింత స్పెషల్‌గా మారింది.
అట్లీకి బర్త్‌డే విషెస్ చెప్పిన అల్లు అర్జున్.. ఆయనతో కలిసి మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు ఎదురుచూస్తున్నానంటూ పోస్ట్ చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా.. తాజాగా గిన్నిస్ రికార్డ్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.
ఇక అల్లు అర్జున్ పుట్టినరోజున విడుదలైన ‘రాకా’ ఫస్ట్ లుక్ కూడా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని కలిగించింది. గుండుతో, పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్తో, ముఖంపై తోడేలు పంజా గుర్తుతో కనిపించిన బన్నీ లుక్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ప్రపంచ స్థాయి టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించారు. ‘ఐరన్ మ్యాన్ 2’, ‘ట్రాన్స్ఫార్మర్స్’ వంటి హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ నిపుణులు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. అకాడమీ అవార్డు గ్రహీత జస్టిన్ రాలీ వంటి ప్రముఖ టెక్నీషియన్లు కూడా సినిమాకు పనిచేస్తున్నారు.
మొత్తానికి విడుదలకు ముందే గిన్నిస్ రికార్డ్ సాధించిన ‘రాకా’.. థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.








