న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ది ప్యారడైజ్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిలీజ్‌కు కేవలం వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ చిత్రబృందం మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ నెల 23న పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా, 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
రిలీజ్‌కు సమయం దగ్గర పడటంతో రీ-రికార్డింగ్, ప్యాచ్ వర్క్, ఫైనల్ అవుట్‌పుట్ వంటి పనులను చిత్రయూనిట్ వేగంగా పూర్తి చేస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌తో కలిసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు హీరో నాని కూడా పోస్ట్ ప్రొడక్షన్ డెలివరీలను స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
అయితే ‘ది ప్యారడైజ్’ విషయంలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం వైరల్ అవుతోంది. ఈ సినిమాకు ఎలాంటి ట్రైలర్‌ను విడుదల చేయకూడదని చిత్రయూనిట్ నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. దీంతో అసలు ట్రైలర్ లేకుండానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం వెనుక కారణం ఏంటనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావడంతో పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చేయడానికి సమయం తక్కువగా ఉన్నప్పటికీ, నాని మాత్రం డిజిటల్ ప్రమోషన్స్‌తో పాటు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై ప్రధానంగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఒకవైపు సినిమా అవుట్‌పుట్ పనులను పర్యవేక్షిస్తూనే, మరోవైపు ప్రమోషన్స్‌ను నాని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ట్రైలర్ లేకుండా, పరిమిత ప్రమోషన్స్‌తో వస్తున్న ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉంటాయి? రిలీజ్ తర్వాత ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.








