ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ స్టార్ ఎవరంటే.. టక్కున గుర్తొచ్చే పేరు డార్లింగ్ ప్రభాస్. ఇప్పటికే తన ఖాతాలో రెండు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన సినిమాలతో పాన్ ఇంఐ డియా రేంజ్లో తన స్టామినా ఏంటో చూపించాడు. ప్రస్తుతం ఒకేసారి ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘కల్కి 2898 AD’ వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు.
అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఒక్క సినిమా విషయంలో ఇప్పటికీ కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. అదే ‘సలార్ 2’. ‘సలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్’ రిలీజ్ తర్వాత దేవా పాత్రలో ప్రభాస్, వరదరాజ మన్నార్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య ఉన్న బాండింగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రశాంత్ నీల్ తనదైన స్టైల్లో ఈ ప్రపంచాన్ని డిజైన్ చేయడంతో సినిమాకు భారీ క్రేజ్ వచ్చింది.
సలార్ 2పై భారీ అంచనాలు
ముఖ్యంగా ‘సలార్’ చివర్లో ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో సీక్వెల్ ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో పార్ట్ 2పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అప్పట్లో మేకర్స్ కూడా సీక్వెల్ తప్పకుండా ఉంటుందని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు ‘సలార్ 2’ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ప్రభాస్ తన వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
వచ్చే ఏడాది జూలై తర్వాత సలార్ 2?
అయితే ‘డ్రాగన్’ తర్వాత ప్రశాంత్ నీల్ ‘KGF 3’ చేస్తాడా? లేక ‘సలార్ 2’పైకి వెళ్తాడా? అనే చర్చ చాలాకాలంగా నడుస్తోంది. గతంలో నీల్ ఇచ్చిన కొన్ని హింట్స్ కారణంగా ఈ అనుమానాలు మరింత పెరిగాయి.
అయితే ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ‘డ్రాగన్’ పూర్తయిన తర్వాత, వచ్చే ఏడాది జూలై తర్వాత ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’ను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే జరిగితే.. అప్పటికి ప్రభాస్ కూడా తన ప్రస్తుత ప్రాజెక్ట్స్‌ను పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
పార్ట్ 2లో ఇప్పటికే షూటింగ్ జరిగిందా?
ఇక ‘సలార్ 2’కు సంబంధించి మరో ఆసక్తికరమైన టాక్ కూడా వినిపిస్తోంది. పార్ట్ 1 షూటింగ్ సమయంలోనే శౌర్యాంగ పర్వానికి సంబంధించిన దాదాపు 20 శాతం షూటింగ్ పూర్తయిందనే ప్రచారం ఉంది. ఇది నిజమైతే.. సీక్వెల్‌ను పట్టాలెక్కించేందుకు మేకర్స్‌కు కొంత సమయం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకురావాలంటే స్క్రిప్ట్, క్యాస్టింగ్, ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటి నుంచే వేగం పుంజుకోవాల్సి ఉంటుంది.
మొత్తానికి.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్ 2: శౌర్యాంగ పర్వం’పై మళ్లీ కొత్త చర్చ మొదలైంది. వచ్చే ఏడాది జూలై తర్వాత సినిమా పట్టాలెక్కుతుందా? లేక మరోసారి వాయిదా పడుతుందా? అన్నది ప్రశాంత్ నీల్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.









