మాస్ మహారాజా రవితేజ మరోసారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఫ్యామిలీ యాక్షన్ థ్రిల్లర్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
ఇప్పటివరకు మాస్, కామెడీ, యాక్షన్ జానర్లతో అలరించిన రవితేజ.. ఈసారి పూర్తిగా భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. భార్య, కూతురే తన ప్రపంచంగా భావించే ఓ సాధారణ మధ్యతరగతి తండ్రిగా ఆయన పాత్రను చూపించారు. ఆటో డ్రైవర్‌గా కుటుంబాన్ని నడుపుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపే వ్యక్తి.. అనుకోని పరిస్థితుల్లో కత్తి పట్టాల్సి వస్తుంది.
ఇక అసలు కథ ఏంటి?
కూతురు కోరిక మేరకు మద్యం మానేయాలని నిర్ణయించుకున్న రవితేజ అయ్యప్ప మాల ధరిస్తాడు. 41 రోజుల కఠినమైన దీక్షలో ఉన్న సమయంలో అతని జీవితంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటాయి. ప్రశాంతంగా ఉండే ఆ తండ్రి ఒక్కసారిగా ఎందుకు హింసాత్మకంగా మారాల్సి వచ్చింది? అతని కుటుంబానికి ఎదురైన సమస్య ఏంటి? అనే ప్రశ్నలు ట్రైలర్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.
మరోవైపు.. ఓ స్కూల్లో చిన్నారుల వరుస మరణాలు కలకలం రేపుతాయి. ఆ మరణాల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? వాటికి రవితేజ పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి? తన కూతురిని ఆ ప్రమాదం నుంచి ఎలా కాపాడుకుంటాడు? అనేదే సినిమాలో ప్రధాన అంశంగా కనిపిస్తోంది.
ట్రైలర్ ప్రారంభంలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథను నడిపించిన మేకర్స్.. క్రమంగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను పెంచారు. ముఖ్యంగా చివరి భాగంలో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఇక రవితేజ, తన కూతురి మధ్య ఉన్న బాండింగ్ కూడా సినిమాలో కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కూతురి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే తండ్రిగా రవితేజ పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా కనిపిస్తోంది. ట్రైలర్‌లోని డైలాగ్స్ కూడా సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి.
మొత్తానికి.. ఫ్యామిలీ ఎమోషన్, యాక్షన్, థ్రిల్లింగ్ మిస్టరీతో ‘ఇరుముడి’ ఈసారి రవితేజను సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు ట్రైలర్ స్పష్టం చేసింది. మరి ఈ కొత్త జానర్‌తో మాస్ మహారాజా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తారో తెలియాలంటే ఆగస్టు 21 వరకు వేచి చూడాల్సిందే.









