ఇటీవల సోషల్ మీడియాలో సీనియర్ ఎన్టీఆర్ చెప్పిన “మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది” అనే డైలాగ్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ డైలాగ్‌ను ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో ఉపయోగించారంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ట్రోలింగ్ కోసం కాదని, కేవలం ఎన్టీఆర్‌కు నివాళిగా ఆయన స్టైల్‌ను ఇమిటేట్ చేశామని హీరో వరుణ్ తేజ్ వివరణ ఇచ్చారు. దీంతో ఈ డైలాగ్ అసలు ఏ సినిమా నుంచి వచ్చిందనే ఆసక్తి మరింత పెరిగింది.
ఈ ప్రసిద్ధ సీన్ 1978లో విడుదలైన ‘యుగపురుషుడు’ చిత్రంలోనిది. వైజయంతీ మూవీస్ నిర్మించిన ఈ సినిమాకు కె. బాపయ్య దర్శకత్వం వహించగా, సి. అశ్విని దత్ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో ఎన్టీఆర్ కరాటే ఫైటర్ రాజేష్ పాత్రలో నటించగా, చంద్రమోహన్‌తో వచ్చే కరాటే ఫైట్ సీన్‌లోనే “మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది” అనే డైలాగ్ వినిపిస్తుంది. ఈ సన్నివేశం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని, ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా కథలో రాజేష్ తన తండ్రి మారుతీరావు కోరిక మేరకు ఓ జమిందారు కోల్పోయిన మనవడు కళ్యాణ్ స్థానంలోకి వెళ్లేందుకు అంగీకరిస్తాడు. అయితే రాజేష్‌ను ప్రేమించిన లత అతడు డబ్బు కోసం నకిలీ మనవడిగా మారాడని అపార్థం చేసుకుంటుంది. ఈ కథలో భాగంగా వచ్చే కరాటే ఫైట్ సీన్, ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి ఈ క్లాసిక్ సన్నివేశం చర్చనీయాంశంగా మారింది.









