మాస్ కమర్షియల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను, తన మొదటి సినిమా ‘భద్ర’ రెమ్యునరేషన్ గురించి, అలాగే రీమేక్ రైట్స్ విషయంలో నిర్మాతతో జరిగిన చిన్న వివాదం గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దిల్ రాజు నిర్మించిన ఈ ‘భద్ర’ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం బోయపాటి బాలకృష్ణతో ‘అఖండ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. బాలయ్యతో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయిన సంగతి తెలిసిందే.
‘భద్ర’ సినిమాకు సంబంధించి బోయపాటి శ్రీనుకి దిల్ రాజు మొదట్లో ₹40 వేలు జీతంగా ఇచ్చారట. ఆ తర్వాత అవసరం పడటంతో లక్ష రూపాయలు ఇవ్వడం, అనంతరం ₹3.5 లక్షలు పెట్టి కారు కొనివ్వడం జరిగిందట. సినిమా విడుదల సమయానికి మరో ₹1.5 లక్షలు ఇవ్వడంతో, కారు విలువతో కలిపి బోయపాటి ఆ సినిమాకు దాదాపు ₹6.4 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నారు.
అయితే, ఈ సినిమా రీమేక్ రైట్స్ విషయంలో బోయపాటి శ్రీనుకు, దిల్ రాజుకు మధ్య చిన్న అభిప్రాయభేదం తలెత్తింది. ‘భద్ర’ కథ, కథనం మొత్తం బోయపాటినే రాసినందున, రీమేక్ రైట్స్ అమ్మితే అందులో 50 శాతం తనకు రావాలని ఆయన భావించారు. కానీ, దిల్ రాజు బోయపాటికి చెప్పకుండానే రెండు భాషలకు రీమేక్ రైట్స్ అమ్మారట. దీని గురించి బోయపాటి అడగ్గా, దిల్ రాజు.. “మొదటి సినిమా చేయడానికి వచ్చినప్పుడు, సినిమా హక్కులపై నీకు ఎలాంటి హక్కులు లేవని కండిషన్ పెడితే చేస్తావా?” అని అడిగారట. దానికి బోయపాటి “చేస్తాను సార్” అని చెప్పడంతో, దిల్ రాజు “ఇంక నీ ఇష్టం, ఆలోచించుకో, నువ్వు అడిగితే డబ్బులు ఇస్తాను” అని చెప్పగా, బోయపాటి “వద్దు సార్” అన్నారట. రవితేజ నటించిన ఈ ‘భద్ర’ చిత్రం కన్నడ, తమిళ్, బెంగాలీ భాషల్లో రీమేక్ అయింది.









