ఆర్ఎక్స్ 100’తో దర్శకుడిగా సంచలన విజయాన్ని అందుకున్న అజయ్ భూపతి, విభిన్న కథలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం జూలై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ చిత్రం ద్వారా సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతుండగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ తెలుగు తెరకు కథానాయికగా ఎంట్రీ ఇస్తోంది. ఇద్దరికీ ఇదే తొలి తెలుగు చిత్రం కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది.
ఈ ప్రమోషన్స్ సందర్భంగా దర్శకుడు అజయ్ భూపతి తన తదుపరి ప్రాజెక్ట్ ‘మంగళవారం 2’ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
‘మంగళవారం 2’ తప్పకుండా తెరకెక్కుతుందని స్పష్టం చేసిన ఆయన, ఈసారి కథను మరింత కొత్తగా, ప్రేక్షకులు ఊహించని విధంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. తొలి భాగానికి పూర్తి భిన్నమైన అనుభూతిని అందించేలా సీక్వెల్ ఉంటుందని, ముఖ్యంగా సూపర్ నేచురల్ అంశాలు కథలో కీలకంగా ఉండనున్నాయని చెప్పారు.
ప్రతి పాత్ర, ప్రతి సంఘటన చివరి వరకు ఉత్కంఠను కొనసాగించేలా కథను సిద్ధం చేస్తున్నామని, ప్రస్తుతం ‘శ్రీనివాస మంగాపురం’ విడుదల పనుల్లో బిజీగా ఉన్నందున ఆ సినిమా విడుదల తర్వాత పూర్తిస్థాయిలో ‘మంగళవారం 2’ స్క్రిప్ట్‌పై దృష్టి పెడతామని అజయ్ భూపతి వెల్లడించారు.
మరోవైపు, ఈ కథను దర్శకుడు కొరటాల శివకు వినిపించగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కొరటాల శివ నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ‘మంగళవారం 2’లో నటీనటులు ఎవరు? సాంకేతిక బృందంలో ఎవరు భాగం కానున్నారు? వంటి వివరాలను చిత్రబృందం త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.








