Search
Close this search box.

  “త్వరగా పెళ్లి చేసుకుని ఆరుగురు పిల్లలతో హ్యాపీగా ఉండు బావా” – ప్రభాస్‌కు మోహన్‌బాబు బర్త్‌డే విషెస్

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు తనదైన ప్రత్యేక శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. మోహన్‌బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నా ప్రియమైన డార్లింగ్ బావా ప్రభాస్, నువ్వు దేశం గర్వించే వ్యక్తివి. నీకు శతాయుష్షు, ఆరోగ్యం, ఆనందం కలగాలి. త్వరలోనే పెళ్లి చేసుకుని అర డజను పిల్లలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నా” అంటూ మోహన్‌బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు. మోహన్‌బాబు చేసిన ఈ ఆసక్తికరమైన కామెంట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

ప్రభాస్ మరియు మోహన్‌బాబు మధ్య ఎంతో కాలంగా అనుబంధం ఉంది. మోహన్‌బాబు రెబల్‌స్టార్ కృష్ణంరాజుతో ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు. ఆయన నట వారసుడైన ప్రభాస్‌తో కూడా ఎంతో సఖ్యతగా ఉంటారు. వీరిద్దరూ కలిసి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బుజ్జిగాడు’ సినిమాలో నటించారు. ఆ సినిమాలో మోహన్‌బాబు హీరోయిన్ త్రిషకు అన్నగా నటించగా, ప్రభాస్ ఆయన్ని ‘బావ’ అని పిలవడం మొదలుపెట్టారు. అప్పటి నుండి ఏ సందర్భం వచ్చినా ఇద్దరూ ‘బావా’ అని పిలుచుకుంటూ ఒకరిపై ఒకరు ప్రేమ, అభిమానం చాటుకుంటారు. అంతేకాకుండా, మోహన్‌బాబుపై ఉన్న గౌరవం వల్లే ప్రభాస్ ‘కన్నప్ప’ చిత్రంలో ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించారని మంచు విష్ణు స్వయంగా తెలిపారు.

మోహన్‌బాబు ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. “అరడజను మంది పిల్లలా.. సరిపోతారా సార్”, “అక్కడ పెళ్లికే దిక్కులేదంటే అరడజను పిల్లలా?”, “పిల్లల సంగతి తర్వాత ముందు మా హీరోకి మంచి పిల్లని చూడొచ్చుగా” అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మొత్తం మీద, ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతుండగా, మోహన్‌బాబు చేసిన ఈ ప్రత్యేకమైన ట్వీట్ మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ప్రభాస్ కటౌట్లు కట్టి, కేక్‌లు కట్ చేసి తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు