సంక్రాంతి… తెలుగువారికి ఎప్పటి నుంచీ అతిపెద్ద పండగ. ఆ మూడు రోజులు కుటుంబం, బంధువులు కలిసి ఆనందంగా గడుపుతారు. పండుగ రాగానే కోడి పందాలు, కొత్త సినిమాలు అన్నీ కలగలిపే సందడి తప్పదనే చెప్పాలి. అందుకే ప్రతి ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సీజన్‌కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది.సాధారణంగా రెండు–మూడు పెద్ద సినిమాలు, ఒకటి–రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. కానీ 2026 సంక్రాంతి మాత్రం విపరీతమైన పోటీని చూడబోతోంది. ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా అరడజను సినిమాలు పండగ రేస్‌లో బరిలోకి దిగుతున్నాయి. ఇంకా అధికారికంగా ప్రకటించని సినిమాలు కూడా ఉన్నాయి.
ఇప్పటికే కన్ఫర్మ్ అయినవేంటంటే –
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మన శంకర వరప్రసాద్
ప్రభాస్ – మారుతీ కాంబోలో ది రాజాసాబ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన జన నాయగన్
యువ హీరో నవీన్ పోలిశెట్టి నటిస్తున్న అనగనగా ఒక రాజు
ఇవన్నీ మేకర్స్ అధికారికంగా సంక్రాంతి రిలీజ్ అని ప్రకటించారు.
ఇకపోతే మాస్ మహారాజా రవితేజ రెండు సినిమాలతో ఈ పోటీలో ఉండబోతున్నాడని టాక్. మాస్ జాతర మొదట రిలీజ్ కావాల్సి ఉన్నా వాయిదా పడింది. ప్రస్తుతం అక్టోబర్ రిలీజ్ టార్గెట్ చేస్తున్నారని వార్తలు. మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో వస్తున్న అనార్కలి కూడా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటూ సంక్రాంతికి సిద్ధమవుతోందని సమాచారం.
సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరో శర్వానంద్ కూడా పండగ సీజన్‌పై కన్నేశాడు. ఆయన నటిస్తున్న నారీ నారీ నడుమ మురారీ సినిమా కూడా సంక్రాంతి రేస్‌లోకి రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
మొత్తానికి 2026 సంక్రాంతికి ఇన్ని సినిమాలు బరిలో ఉండటంతో థియేటర్ల డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుందో, కలెక్షన్ల పోటీ ఎలా ఉంటుందో చూడాలి..









