కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ మరో సరికొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లోకేశ్… ఇప్పుడు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
ఇప్పటికే ‘డీసీ’ (వర్కింగ్ టైటిల్) చిత్రంతో నటుడిగా వెండితెరపై అడుగుపెట్టేందుకు సిద్ధమైన లోకేశ్… ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అల్లు అర్జున్‌తో చేయబోయే భారీ ప్రాజెక్ట్ ప్రారంభానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో, ఆ గ్యాప్‌ను సద్వినియోగం చేసుకుంటూ సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించారు. కొత్త కథలు, కొత్త దర్శకులు, విభిన్నమైన కంటెంట్‌తో వచ్చే ప్రతిభావంతులను ప్రోత్సహించడమే ఈ బ్యానర్ ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథతో తొలి నిర్మాణం
లోకేశ్ నిర్మించనున్న తొలి చిత్రం ఓ పవర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్‌గా రూపొందనుంది. ఇందులో ప్రధాన పాత్ర కోసం టాలెంటెడ్ నటి రెజీనా కసాండ్రాను ఎంపిక చేసినట్లు సమాచారం. ‘శివ మనసులో శృతి’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘ఎవరు’ వంటి చిత్రాల్లో తన నటనతో మెప్పించిన రెజీనాకు ఈ సినిమా కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
యాక్షన్, సస్పెన్స్ అంశాలతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు విశాల్ వెంకట్ దర్శకత్వం వహించనున్నారని టాక్. ‘సిల నేరంగళిల్ సిల మనితర్గళ్’ వంటి విభిన్న కథను తెరకెక్కించిన ఆయనపై లోకేశ్ పూర్తి నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తవగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా సాగుతున్నాయని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. తన సినిమాల్లో ప్రతి పాత్రను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దే లోకేశ్… ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట.
అధికారిక ప్రకటనకు రంగం సిద్ధం
ఈ చిత్రంలో రెజీనా పాత్ర ప్రేక్షకులకు బలమైన సందేశాన్ని అందించడంతో పాటు, ఆద్యంతం ఉత్కంఠభరితమైన అనుభూతిని కలిగించేలా ఉంటుందని సమాచారం. లోకేశ్ నటిస్తున్న ‘డీసీ’ సినిమా ప్రమోషన్స్ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించి గ్రాండ్‌గా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
ఇక సినిమా ప్రారంభం కాకముందే డిజిటల్, శాటిలైట్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దర్శకుడిగా సంపాదించుకున్న బ్రాండ్ ఇమేజ్‌ను నిర్మాతగా కూడా విజయవంతంగా కొనసాగించాలని లోకేశ్ కనగరాజ్ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. 2026 ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.









