కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ గురించి మరో క్రేజీ అప్డేట్ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాను ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమాపై మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే విడుదలైన ‘టాక్సిక్’ టీజర్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే టాక్ బలంగా వినిపించింది. టీజర్‌పై మిశ్రమ స్పందన రావడంతో సినిమాపై కూడా పలు సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో మేకర్స్ కొన్ని కీలక సన్నివేశాలను రీషూట్ చేసి సినిమాను మరింత గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక సినిమా ప్రమోషన్స్‌ను కూడా భారీ స్థాయిలో ప్రారంభించేందుకు యశ్, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే సినిమాపై హైప్ పెంచేందుకు జూలై 1న కొత్త టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈసారి ప్రేక్షకులకు బలంగా కనెక్ట్ అయ్యేలా పవర్ఫుల్ కట్స్‌తో టీజర్‌ను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘టాక్సిక్’లో భారీ స్టార్కాస్ట్ కనిపించనుంది. కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, హ్యూమా ఖురేషి సహా పలువురు ప్రముఖ హీరోయిన్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే, రేపు విడుదల కానున్నట్లు ప్రచారం జరుగుతున్న కొత్త టీజర్ నిజంగానే ‘టాక్సిక్’పై అంచనాలను పెంచుతుందా? లేక మరోసారి మిశ్రమ స్పందననే తెచ్చుకుంటుందా? అనేది చూడాలి.








