మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ఆసక్తిని రేకెత్తించిన ప్రాజెక్ట్‌లలో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’తో బ్లాక్‌బస్టర్ అందించిన దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం, భారీ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్, ఫాంటసీ జానర్, అలాగే ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ తరహా విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే ప్రచారంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే సినిమా టీజర్ విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా లేవని సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదురైంది. దీంతో మేకర్స్ వెంటనే వీఎఫ్ఎక్స్ పనులను మళ్లీ ప్రారంభించి, ప్రతి ఫ్రేమ్‌ను మరింత నాణ్యతతో తీర్చిదిద్దే పనిలో పడ్డారు.
సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయిందని వార్తలు వచ్చినప్పటికీ, వీఎఫ్ఎక్స్పై ఎలాంటి రాజీ పడకూడదనే నిర్ణయంతో విడుదల పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా రిలీజ్ కాకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇక తాజాగా మరో ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. దాదాపు అన్ని వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యాయని, అయితే వాటికి మరింత ఎలివేషన్ ఇచ్చేలా సినిమాలో ఒక కొత్త ఎపిసోడ్‌ను జోడించాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందుకోసం మరో చిన్న షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తున్నారట.
ఈ అదనపు చిత్రీకరణ కోసం చిరంజీవి సుమారు వారం రోజుల కాల్షీట్స్ కేటాయించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన కొత్త సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆ షెడ్యూల్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ‘విశ్వంభర’ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నారని తెలుస్తోంది.
ఈ కొత్త షెడ్యూల్ పూర్తైన తర్వాత మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేసి, దసరా కానుకగా ‘విశ్వంభర’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరి ఈ భారీ ఫాంటసీ విజువల్ వండర్ ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.








