సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య అభిమానులకు భారీ సర్ప్రైజ్ అందింది. వైవిధ్యభరితమైన పాత్రలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన సూర్య, ఇప్పుడు భారతీయ సినిమా మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటైన హోంబాలే ఫిలిమ్స్‌తో చేతులు కలిపారు. కేజీఎఫ్, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్స్‌ను అందించిన ఈ సంస్థతో సూర్య కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ‘జై భీమ్’ ఫేమ్ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ డైరెక్ట్ చేయనున్నారు. గతంలో సూర్య–జ్ఞానవేల్ కాంబినేషన్లో వచ్చిన జై భీమ్ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఇప్పుడు అదే జోడీ మరోసారి కలుస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
హోంబాలే ఫిలిమ్స్ ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఓ పవర్ఫుల్ సోషల్ డ్రామాగా తీర్చిదిద్దనున్నారని సమాచారం. సూర్య సరసన టాలెంటెడ్ హీరోయిన్ కయాదు లోహార్ నటించనుంది.
ఈ సందర్భంగా హోంబాలే ఫిలిమ్స్ విడుదల చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “మూడు దశాబ్దాలుగా నిజాయితీ గల పాత్రలతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మోస్ట్ ఫియర్లెస్ యాక్టర్ సూర్యను మా గ్రాండ్ స్టేజ్‌పైకి స్వాగతిస్తున్నాం” అంటూ సంస్థ పేర్కొంది.
ఈ చిత్రానికి సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. త్వరలోనే సినిమా టైటిల్‌తో పాటు రెగ్యులర్ షూటింగ్ అప్డేట్స్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.









