ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టు కోవాలని పిఠాపురం నియోజకవర్గ ఆర్య వైశ్య సంఘం నాయకులు కోరారు. పిఠాపురం కోటగుమ్మం కూడలి వద్ద శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రసిద్ధి గాంచిన శ్రీపాద శ్రీవల్లభ ఆలయం చైర్మన్ పదవి, ఆలయ నిర్వాహణ బాధ్యతను ఆర్యవైశ్యులకు అప్పగిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే కొద్ది రోజులుగా పిఠాపురంలో జరుగుతున్న రాజకీయ వాతావరణ పరిస్థితులు చూస్తుంటే ఆలయ చైర్మన్ పదవి విషయంలో కొత్త వ్యక్తుల పేర్లు రావడం తమకు బాధకలిగిస్తోందన్నారు. శ్రీపాద వల్లభ చరిత్రా మృతం ప్రచారం చేయడంలో ఆర్యవైశ్యుల పాత్రే కీలకమన్నారు.
ఆలయ స్థాపకుడు దివంగత సజ్జనగడ రామస్వామి ఆధ్వర్యంలో ఆలయం అభివృద్ధి చేయడానికి ఆర్యవైశ్యులే ప్రధాన పాత్రపోషించారన్నారు. ఈవిషయాలపై పవన్ కళ్యాణ్ గతంలో తమతో సమీక్షించారని, కూటమి అధికారం చేపట్టిన వెంటనే ఆలయ నిర్వాహణ బాధ్యతను ఆర్యవైశ్యులకు అప్పగిస్తామని పవన్ చెప్పారన్నారు. మరోక్కసారి ఈవిషయాలపై పవన్ సమీక్షించి న్యాయం చేయాలని ఆర్యవైశ్యులు కోరుతున్నామన్నారు.
సమావేశంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఉపాధ్యక్షులు వెలగ వెంకట నగేష్. కేతవరపు కృష్ణ, దంగేటి సత్యనా రాయణ, కంచర్ల నగేష్. ఇమిడిశెట్టి నాగేంద్ర, కర్ణాటకపు తాతాజీ బోడ సతీష్, చక్కా సుబ్రహ్మాణ్యం, దత్త చల పతి, నడిపల్ల ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు