సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో చర్చకు వస్తున్న కాస్టింగ్ కౌచ్ అంశంపై సీనియర్ నటి రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఇలాంటి వేధింపులు ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. గతంలోనూ ఈ సమస్య ఉందని, ఇప్పటికీ కొనసాగుతోందని, భవిష్యత్తులో కూడా పూర్తిగా అంతమయ్యే పరిస్థితి లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రమ్యకృష్ణ.. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన సమస్య కాదని అన్నారు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మహిళలు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, అలాంటప్పుడు మన దగ్గర ఈ సమస్య లేదని చెప్పలేమని పేర్కొన్నారు. గ్లామర్ ప్రపంచం కావడంతో సినిమా ఇండస్ట్రీలో జరిగే విషయాలు ఎక్కువగా ప్రచారంలోకి వస్తాయని, కానీ ఇతర రంగాల్లో కూడా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయని వివరించారు.
అంతేకాదు, తన కెరీర్ ప్రారంభంలో సినిమా సెట్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా రమ్యకృష్ణ గుర్తుచేసుకున్నారు. అప్పట్లో షూటింగ్ లొకేషన్లలో కనీసం వాష్‌రూమ్‌లు, క్యారవాన్లు కూడా అందుబాటులో ఉండేవి కావని తెలిపారు. దుస్తులు మార్చుకోవడానికి సరైన ప్రైవసీ కూడా ఉండేది కాదని చెప్పారు. కొన్ని సందర్భాల్లో అంబాసిడర్ కార్లలో కూర్చుని బాటిళ్లను ఉపయోగించాల్సిన పరిస్థితులు కూడా ఉండేవని వెల్లడించారు.
ఆ రోజులతో పోలిస్తే ప్రస్తుతం సినిమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయని, ఇప్పటి నటీనటులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. తాము కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న కష్టాలతో పోలిస్తే ఇప్పటి తరం నటీనటులు ఎంతో అదృష్టవంతులని అన్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే రమ్యకృష్ణ ఇటీవల రజనీకాంత్‌తో కలిసి ‘జైలర్ 2’లో నటించారు. ప్రస్తుతం ‘రాకా’, ‘శ్రీ శ్రీ’, ‘పాకెట్ నావెల్’, ‘తేరా యార్ హూ మే’ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. మొత్తానికి కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.








