మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నెట్ఫ్లిక్స్ వేదికగా ‘మెగావర్స్’ అనే టాక్ షోతో డిజిటల్ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేశారు. ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇప్పటికే పలువురు స్టార్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా ఈ మెగావర్స్ షోకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఇద్దరు ప్రముఖులు ఈ షోలో సందడి చేయబోతున్నారనే ప్రచారం మొదలైంది.
వారెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్. వీరిద్దరూ కలిసి చిరంజీవి హోస్ట్ చేస్తున్న మెగావర్స్ టాక్ షోలో పాల్గొనబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఈ వార్త నిజమైతే అభిమానులకు అంతకంటే పెద్ద ట్రీట్ మరొకటి ఉండదు. ఒకే వేదికపై మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కనిపిస్తే సోషల్ మీడియా మొత్తం ఈ ఎపిసోడ్ గురించే చర్చించుకోవడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మెగాస్టార్ షోలో పాల్గొంటారనే వార్త మరింత ఆసక్తిని పెంచుతోంది.
అయితే ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా మెగావర్స్ షోలో పాల్గొంటున్నారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగానే మెగాస్టార్ షోలో సందడి చేస్తుందా? అనేది తెలియాలంటే అధికారిక అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








