స్టార్ హీరోల ప్రమోషన్స్‌తో విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘ఇట్లు అర్జున’. నూతన నటుడు అనీష్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్గా నటించింది. ఇక సక్సెస్ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ యాక్షన్ కామెడీ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది? అసలు సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకుందాం.
కథ విషయానికి వస్తే..
పెద్దన్న (ముఖేష్ రిషి) అనే గ్యాంగ్‌స్టర్‌కు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారంతో ఉన్న ఓ పెన్‌డ్రైవ్ అనూహ్యంగా దొంగతనానికి గురవుతుంది. దీంతో ఎలాగైనా ఆ పెన్‌డ్రైవ్‌ను తిరిగి తీసుకురావాలని తన అనుచరులకు పెద్దన్న ఆదేశాలు జారీ చేస్తాడు.
మరోవైపు చిన్నప్పటి నుంచి కీర్తి (అనస్వర రాజన్)ను ప్రేమిస్తున్న అర్జున్ (అనీష్) పిక్‌పాకెట్ చేస్తూ జీవిస్తుంటాడు. ఓ వైకల్యం కారణంగా అతడికి మాటలు రావు. ఈ క్రమంలో అర్జున్, కీర్తి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. అయితే అనుకోని పరిణామాలతో వీరిద్దరూ పెద్దన్న గ్యాంగ్‌కు సంబంధించిన సమస్యల్లో చిక్కుకుంటారు. అసలు ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న రహస్యం ఏమిటి? అర్జున్, కీర్తి ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ సంగీత దర్శకుడు తమన్ అందించిన నేపథ్య సంగీతం. హీరో పాత్రకు మాటలు రాకపోవడంతో సన్నివేశాల్లో భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరవేయడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విషయంలో తమన్ తన బీజీఎంతో సినిమాకు మంచి బలాన్ని అందించారు.
హీరోగా మొదటి సినిమాతోనే అనీష్ మంచి నటన కనబరిచాడు. మాటలు లేని ఛాలెంజింగ్ పాత్రను ఎంచుకోవడమే కాకుండా, తన హావభావాలతో పలు సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో అతడి నటన మెప్పిస్తుంది.
హీరోయిన్ అనస్వర రాజన్ తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అనీష్‌తో ఆమె కెమిస్ట్రీ చాలా సహజంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె అమాయకత్వంతో కూడిన నటన కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుంది.
సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా సాగుతుంది. ప్రేమ, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. కలైయరసన్, ఇలంగో కుమరవేల్ తమ పాత్రలకు న్యాయం చేస్తూ సినిమాకు మరింత వినోదాన్ని జోడించారు.
మైనస్ పాయింట్స్:
ఫస్టాఫ్‌లో మంచి వేగంతో కథను నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌లో అదే స్థాయి ఆసక్తిని కొనసాగించలేకపోయాడు. ముఖ్యంగా ద్వితీయార్థంలో కామెడీ తగ్గడంతో పాటు క్రైమ్ ఎలిమెంట్స్ కాస్త నెమ్మదిగా సాగుతాయి.
అలాగే విలన్‌గా నటించిన ముఖేష్ రిషి పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దాల్సింది. హీరో, విలన్ గ్యాంగ్ మధ్య వచ్చే పోరాట సన్నివేశాల్లో మరింత ఉత్కంఠ ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. లవ్ ట్రాక్, కామెడీ బాగున్నప్పటికీ క్రైమ్ నేపథ్యం మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోదు.
అయితే ఈ లోపాలు సినిమా మొత్తం వినోదాన్ని పూర్తిగా దెబ్బతీసేలా ఉండవు.
సాంకేతిక విభాగం:
ఈ సినిమాకు తమన్ అందించిన సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. పాటలు వినసొంపుగా ఉండటంతో పాటు, నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశానికి మంచి ఫీల్‌ను తీసుకొచ్చింది. కొన్ని చోట్ల కథనంలో కనిపించే చిన్నపాటి లోపాలను కూడా తన బీజీఎంతో కవర్ చేశాడు.
రాజా మహాదేవన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాల్లో అందమైన విజువల్స్‌తో మంచి అనుభూతిని అందించారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. దర్శకుడు మహేష్ ఉప్పాల తన తొలి ప్రయత్నంలోనే మంచి ప్రతిభను చూపించారు.
ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే..
మొత్తంగా ‘ఇట్లు అర్జున’ ఒక మంచి రొమాంటిక్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. అనీష్, అనస్వర రాజన్ల క్యూట్ కెమిస్ట్రీ, ఫస్టాఫ్‌లో ఆకట్టుకునే కామెడీ, తమన్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. సెకండాఫ్‌లో క్రైమ్ ట్రాక్ కాస్త నెమ్మదించడం, విలన్ పాత్ర బలంగా లేకపోవడం కొన్ని మైనస్ పాయింట్స్. అయినప్పటికీ ఓవరాల్‌గా సినిమా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈ వీకెండ్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సరదాగా సినిమా చూడాలనుకునే వారికి ‘ఇట్లు అర్జున’ ఓ మంచి ఎంపిక.








