పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు సిద్ధమవుతున్నారా? ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే విషయంపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తాజాగా స్వయంగా దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు, మరోసారి ఆయనతో సినిమా చేయాలనే తన కోరికను బయటపెట్టారు.
ఇటీవల ‘రామాయణం’ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లో పాల్గొన్న దిల్ రాజును పవన్ కళ్యాణ్‌తో జరిగిన తాజా భేటీ గురించి మీడియా ప్రశ్నించింది. దీనికి సమాధానంగా ఆయన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. గతంలో ఒక నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో ‘వకీల్ సాబ్’ సినిమా చేశానని, ఇప్పుడు మరో మంచి సినిమా చేయాలనే ఉద్దేశంతోనే ఆయన్ని కలిసినట్లు స్పష్టం చేశారు.
అంతేకాదు, పవన్ కళ్యాణ్‌తో మరో ప్రాజెక్ట్ చేయాలనే విషయంలో తనకు స్పష్టమైన ఆలోచన ఉందని, అందుకోసం ప్రయత్నాలు కూడా చేస్తున్నానని దిల్ రాజు తెలిపారు. అయితే కథ, దర్శకుడు, ఇతర అంశాలన్నీ ఖరారైన తర్వాతే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తానని చెప్పారు.
ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ నటించనున్న ‘ఓజీ 2’ సినిమాను దిల్ రాజు నిర్మిస్తారా? అనే ప్రశ్న కూడా ఎదురైంది. అయితే దీనిపై ఆయన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పవన్‌తో మరో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే కలిశానని మాత్రమే సమాధానమిచ్చారు. దీంతో ఓజీ 2 విషయంలో క్లారిటీ రాకపోయినా, పవన్ – దిల్ రాజు కాంబినేషన్లో మరో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
మరోవైపు తనకు ‘సంక్రాంతి రాజు’ అనే పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని కూడా దిల్ రాజు వెల్లడించారు. కెరీర్ ప్రారంభంలో ‘దిల్’, ‘ఆర్య’, ‘భద్ర’, ‘బొమ్మరిల్లు’ వంటి విజయవంతమైన సినిమాలు సమ్మర్లో విడుదల కావడంతో అందరూ తనను ‘సమ్మర్ రాజు’ అని పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతి పండుగ సమయంలో వరుసగా సినిమాలు విడుదలై మంచి విజయాలు సాధించడంతో ‘సంక్రాంతి రాజు’ అనే పేరు స్థిరపడిపోయిందని తెలిపారు.
అయితే ఇలాంటి బిరుదులు, పేర్లు శాశ్వతంగా ఉండవని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు తనను ‘గోల్డెన్ హ్యాండ్’ అని కూడా పిలిచేవారని, సినిమా ఇండస్ట్రీలో విజయాలు, పరాజయాలు సహజమని చెప్పారు. పరిస్థితులను బట్టి ప్రేక్షకులు, మీడియా రకరకాల పేర్లు పెడుతుంటారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్‌తో మరో సినిమా చేయాలనే తన కోరికను దిల్ రాజు బయటపెట్టడంతో ఈ క్రేజీ కాంబినేషన్‌పై మళ్లీ అంచనాలు మొదలయ్యాయి. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు? ఈ ఇద్దరి కాంబినేషన్లో కొత్త సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది? అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.








