ప్రతిష్టాత్మక బయోపిక్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్. మాధవన్ మరోసారి నిజ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జి.డి.నాయుడు’ చిత్రంలో భారతీయ శాస్త్రవేత్త, ఆవిష్కర్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్నారు. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’గా పేరొందిన జి.డి.నాయుడు జీవిత ప్రయాణం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ చిత్రంలో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్, వినయ్ రాయ్ కీలక పాత్రలు పోషించగా, గోవింద్ వసంత సంగీతం అందించారు. ‘రాకెట్రి: ది నంబి ఎఫెక్ట్’ తర్వాత మరోసారి నిజ జీవిత పాత్ర కోసం మాధవన్ ప్రత్యేక మేకోవర్‌తో విభిన్న గెటప్స్‌లో కనిపించనున్నారు. పీరియాడికల్ సెట్స్, నిర్మాణ విలువలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి విశేష స్పందన లభించింది. భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ‘జి.డి.నాయుడు’ ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.








