మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన వివాహ జీవితం, లావణ్య త్రిపాఠితో తన అనుబంధం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన.. ప్రేమ నుంచి పెళ్లి వరకు తన ప్రయాణాన్ని పంచుకుంటూ, సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
తనకు కేవలం వయసు వచ్చిందనే కారణంతో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడూ లేదని వరుణ్ తేజ్ తెలిపారు. మంచి అవగాహన, అనుబంధం, ఇద్దరి మధ్య కాంపాటిబిలిటీ చాలా ముఖ్యమని, ఆ లక్షణాలన్నీ లావణ్య త్రిపాఠిలో కనిపించడంతోనే ఆమెను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నానని వెల్లడించారు.
లావణ్య తనకు పూర్తి భిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని వరుణ్ చెప్పారు. తాను కొంత రిజర్వ్‌డ్‌గా ఉంటే, లావణ్య మాత్రం అందరితో కలిసిపోయే సరదా స్వభావం కలిగిన వ్యక్తి అని తెలిపారు. మొదటిసారి మాట్లాడినప్పుడే ఆమె హ్యూమరస్‌గా అనిపించిందని, రోజులు గడిచేకొద్దీ ఆమె వ్యక్తిత్వాన్ని మరింతగా అర్థం చేసుకుని తమ బంధం మరింత బలపడిందని చెప్పారు.








