భారతీయ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లలో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ ఒకటి. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న ఈ విజువల్ వండర్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా భావిస్తున్నారు. అంతేకాదు, ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్న చిత్రంగా కూడా దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
ఇటీవల ఈ సినిమా ట్రైలర్‌ను జూలై 18న జరిగే ప్రముఖ హాలీవుడ్ ఈవెంట్ కామిక్-కాన్ వేదికగా విడుదల చేయనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అభిమానులు ఆ తేదీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు.
అయితే ఆ ప్రచారానికి మేకర్స్ తాజాగా ఫుల్ స్టాప్ పెట్టారు. ‘రామాయణ’ గ్రాండ్ ట్రైలర్ ప్రీమియర్ జూలై 24న జరగనుందని అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానుల దృష్టి ఇప్పుడు ఆ బిగ్ డే వైపు మళ్లింది.
మేకర్స్ విడుదల చేసిన తాజా పోస్టర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందులో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు అయోధ్యను విడిచి వనవాసానికి బయలుదేరుతున్న దృశ్యాన్ని ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరించారు. పోస్టర్‌లోని విజువల్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
భారతీయ ఇతిహాసాన్ని అత్యాధునిక సాంకేతికతతో తెరపై ఆవిష్కరించబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక జూలై 24న విడుదల కానున్న ట్రైలర్ ఆ అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.








