మెగా ఫ్యామిలీ నుంచి తనదైన గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల ప్రస్తుతం నిర్మాణ రంగంలో దూసుకుపోతున్నారు. తన సొంత బ్యానర్ ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’పై ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రాళ్ళు’ ఘనవిజయం సాధించడంతో, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘రాకాస’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.
ఈ సినిమా విశేషాల గురించి నిహారిక మాట్లాడుతూ, ‘రాకాస’ ఒక విభిన్నమైన ‘హర్రర్ కామెడీ ప్లస్ ఫాంటసీ’ జానర్లో తెరకెక్కిందని తెలిపారు. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా క్లీన్ ఎంటర్టైనర్గా దీనిని రూపొందించామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. గతంలో సంగీత్ శోభన్తో ఆమె నిర్మించిన ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో, ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
అయితే కేవలం నిర్మాతగానే కాకుండా, మళ్లీ నటిగా కూడా వెండితెరపై మెరవడానికి నిహారిక సిద్ధమయ్యారు. తాజాగా జరిగిన ప్రమోషన్లలో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి క్లారిటీ ఇస్తూ.. త్వరలోనే మళ్లీ మేకప్ వేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని ఆసక్తికరమైన కథలు విన్నానని, అన్నీ అనుకూలిస్తే 2027లో మళ్లీ హీరోయిన్గా ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు.








