కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి త్రాగునీరు,ప్రతి ఎకరానికి సాగునీరు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పంతం నానాజి అన్నారు.కరపలో నీలయ్య తోటలో జలజీవన్ మిషన్ ఇంటింటికి కుళాయి పథకంలో నిర్మించిన వాటర్ హెడ్ ట్యాంక్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 6400 కుళాయిలు ఇంటింటికి వేశామని,గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకులు నిర్మించి సంవత్సరాల తరబడి ఉన్న నీటి కొరతను నివారిస్తున్నామన్నారు. 10 గ్రామాల పరిధిలోని సంపులు ఏర్పాటు చేసి పరిశుద్ధమైన త్రాగునీరు సరఫరాకు చర్యలు చేపడుతున్నామన్నారు.రూరల్ పరిధిలోని కొవ్వూరు ,
కొవ్వాడ,రేపూరు లకు శాశ్వత త్రాగునీరు పరిష్కారం చూపామన్నారు. వ్యవసాయానికి సాగునీరు కొరత రాకుండా చూస్తున్నామని,ముంపును అధిగమించేందుకు అవసరమైన చోట మురుకు కాలువల పైన క్రాస్ బండలు నిర్మించి, గొర్రిపూడిలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించేందుకు ఇరిగేషన్ ఉన్నత అధికారులతో చర్చించి చర్యలు చేపడతామన్నారు.








