దర్శకుడు మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘ది రాజాసాబ్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో సోషల్ మీడియాలో మారుతిపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ప్రభాస్-మారుతి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కబోతోందంటూ గత కొన్ని రోజులుగా ఫిలిం నగర్ వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం ఊపందుకోవడంతో రెబల్ స్టార్ అభిమానుల్లో తీవ్ర చర్చ మొదలైంది.
అయితే, ఈ వార్తలపై ప్రభాస్ టీమ్ తాజాగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్, మారుతి కాంబోలో తదుపరి సినిమా వస్తోందన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని కొట్టిపారేసింది. ‘రాజాసాబ్’ ఫలితం తర్వాత అభిమానులు అసంతృప్తితో ఉన్న తరుణంలో ఇలాంటి వార్తలు వారిని మరింత నిరాశకు గురిచేయకూడదనే ఉద్దేశంతో టీమ్ త్వరగానే స్పందించి ఈ రూమర్లకు చెక్ పెట్టింది.
కాగా, ప్రభాస్ నేరుగా సినిమా చేయకపోయినా, మారుతికి తన మద్దతును మాత్రం కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మారుతి కష్టాన్ని గుర్తించిన ప్రభాస్, ఆయనకు హోంబలే ఫిలిమ్స్ లో ఒక ప్రాజెక్ట్ సెట్ చేయించారని సమాచారం. అయితే ఇది ప్రభాస్తో కాకుండా వేరే హీరోతో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం మారుతి స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారని, త్వరలోనే ఆ హీరో ఎవరనేది వెల్లడయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ సర్కిల్స్ గుసగుసలాడుకుంటున్నాయి.









