ధర్మం కోసం పనిచేయాలనే స్ఫూర్తి ‘అఖండ 2’ సినిమా చూసిన తర్వాత తన జీవితం మరియు సమయాన్ని ఇప్పటివరకు వృధా చేసుకున్నానని అనిపించిందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ చిత్రం చూశాక మిగిలిన జీవితాన్ని ధర్మం కోసం, దేశం కోసం అంకితం చేయాలనే బలమైన ఆలోచన కలిగిందని ఆయన తెలిపారు. వంద శాతం ధర్మం గురించి ఆలోచింపజేసే చిత్రమని, ప్రతి ఒక్కరిలోనూ భక్తిని, బాధ్యతను పెంపొందించేలా ఈ సినిమాను తెరకెక్కించారని ఆయన కొనియాడారు.
నటనలో పరమేశ్వరుడి ప్రతిరూపం సినిమాలో నందమూరి బాలకృష్ణ నటన అద్భుతంగా ఉందని, ఆయన్ని చూస్తుంటే సాక్షాత్తు పరమేశ్వరుడే ప్రత్యక్షమైనట్లు అనిపించిందని బండి సంజయ్ పేర్కొన్నారు. బాలకృష్ణ తన నటనతో సీనియర్ ఎన్టీఆర్ గారిని గుర్తు చేస్తున్నారని, ఆ రూపంలో గొప్ప దైవత్వాన్ని చూసుకుంటున్నామని ఆయన భావోద్వేగంగా చెప్పారు. నందమూరి అభిమానులకు ఈ చిత్రం ఒక విందు భోజనం లాంటిదని ఆయన అభివర్ణించారు.
యువతలో పెరుగుతున్న క్రేజ్ బాలకృష్ణ సినిమాలపై ప్రస్తుతం యువతలో, ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల్లో విపరీతమైన క్రేజ్ పెరిగిందని బండి సంజయ్ అన్నారు. స్టూడెంట్స్ బెట్టింగ్లు వేసుకొని మరీ ఈ సినిమా చూస్తున్నారంటే బాలయ్య మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ధర్మాన్ని రక్షించే కథాంశంతో వచ్చిన ‘అఖండ 2’ ప్రస్తుతం సమాజానికి ఎంతో అవసరమని ఆయన అభినందించారు.









