ప్రభాస్‌తో ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి రమణి (60) ఈ నెల 15వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఈ విషాద వార్తను దర్శకుడు రాధాకృష్ణ ఆలస్యంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆయనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
తల్లిని స్మరించుకుంటూ రాధాకృష్ణ తన ఇన్‌స్టాగ్రామ్‌లో హృదయాన్ని కదిలించే పోస్ట్ పెట్టారు. “ప్రపంచంలో నాకంటూ ఓ స్థానం ఇచ్చావు. నా మనసులో శూన్యత మిగిల్చి వెళ్లిపోయావు. నీతో ఇన్నాళ్లు బతికిన జీవితమే ఓ సెలబ్రేషన్ అమ్మా…! నేను నిన్ను ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటా మై ఫస్ట్ లవ్” అంటూ ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
రాధాకృష్ణ కుమార్ కెరీర్ విషయానికొస్తే, ఆయన మొదట దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వద్ద ‘అనుకోకుండా ఒకరోజు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ వంటి చిత్రాలకు సహాయకుడిగా పనిచేశారు. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘జిల్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆయన రెండో చిత్రం ప్రభాస్‌తో తెరకెక్కించిన పాన్-ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ చిత్రం 2022లో విడుదలైనా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత ఆయన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.









