సహకార సంఘాల ద్వారా మెరుగైన సమాజం ఏర్పడుతుందని, ప్రస్తుతం లక్షలాది మందికి మంచి అవకాశాలు సహకార బ్యాంకులు అందిస్తున్నాయని పెందుర్తి మాజీ శాసనసభ్యులు, ది-విశాఖపట్నం కో-ఆపరేటీవ్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ మానం ఆంజనేయులు అన్నారు. ఐక్యరాజ్యసమితి 2025 సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకారం సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. పిఠాపురం పట్టణంలోని సూర్యరాయ గ్రంథాలయంలో ది-విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకు ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో సహకార బ్యాంకుల ఆవశ్యకతను వక్తలు తెలిపారు. ఈసందర్భంగా మానం ఆంజనేయులు మాట్లాడుతూ దేశ జనాభాలో 12 శాతం సహకార సంఘాలలో సభ్యులుగా ఉన్నారన్నారు. దేశవ్యాప్తంగా 8 లక్షల సహకార సంఘాలు ఉన్నట్లు వివరించారు. విద్య, వైద్య వంటి రంగాలు సహకార సంఘాలపై ఆధారపడుతున్నాయన్నారు. ఆర్థిక భాగస్వామ్యం, స్వయం ప్రతిపత్తికి సహకార సంఘాలు ఎంతో మేలు చేస్తున్నాయని, వాటిని ఇంకా ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.సహకార వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో విశాఖ సహకార బ్యాంకు డైరక్టర్ డాక్టర్ చెలికాని కృష్ణమోహన్, జోనల్ మేనేజర్ పి.ఆర్. ఠాగూర్, పిఠాపురం విశాఖ బ్యాంకు మేనేజర్ జి.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.









