మహాశివరాత్రి సందర్భంగా పంచారామ క్షేత్రమైన సామర్లకోట శ్రీ కుమార రామ భీమేశ్వరాలయం భక్తి పారవస్యంతో నిండిపోయింది. మంగళ వారం రాత్రి ఒంటిగంట నుండి వేల సంఖ్యలో భక్తులు క్యూలో వేచి ఉండి భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ పూజల జిల్లా ఎస్పీ బిందు మాధవ్, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కూడా చైర్మన్ తుమ్మల రామస్వామి (బాబు)లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు.
భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు ఆలయ పుష్కరిణిలో, గోదావరి నదిలోని ఆలయ ఆర్చి వద్ద గల స్నాన ఘట్టం వద్ద, జల్లు స్నాన ఘట్టాల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు.శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజీలను ఎస్పీ పరిశీలించారు. దైవ దర్శనం అనంతరం ఎమ్మెల్యే చినరాజప్ప వేట్లపాలెం కొండపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన పాలు రొట్టెలు బిస్కెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
లైన్స్ క్లబ్ ఉప్పు సీతారామయ్య ట్రస్ట్, మధుగులమ్మ ఆలయం, ఫ్రెండ్స్ ఫరెవర్ వంటి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో భక్తులకు పులిహార పాలు రొట్టెలు, ఉప్మా, భీమేశ్వర అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. ఆలయం వద్ద ప్రత్యేక పారిశుధ్య చర్యలకు సామర్లకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 50 మంది సిబ్బందిచే విధులు నిర్వహించారు.
ఆలయం వద్ద భక్తులకు పట్టణ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరి రాజు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారు.