ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా ఉన్న జీవి రెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం ప్రకటించారు. టిడిపి ప్రాథమిక సభ్యత్వానికి జీవి రాజీనామా కలకలం సృష్టిస్తోంది. గతంలో టిడిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన పార్టీలోకి చేరారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత చంద్రబాబు జీవికి మంచి గౌరవం ఇచ్చారు. ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్‌గా కీలక బాధ్యతలు అప్పగించారు. అయితే ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ పై జీవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫైబర్ నెట్‌లో జరుగుతున్న పలు అక్రమాలపై గళం విప్పారు. నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి దినేష్ కుమార్ తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబట్టారు. ఈపంచాయతీ చంద్రబాబు వద్దకు వెళ్లింది. చివరకు చంద్రబాబు జీవికి నచ్చజెప్పి సర్దుకుపోవాలన్న సందేశాన్నిచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో జీవి రెడ్డి తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు.
ఏ పార్టీలోకి చేరను..న్యాయవాదిగా కొనసాగుతా..
తన రాజీనామా ప్రకటన అనంతరం జీవి రెడ్డి తాను, ఏపార్టీలోకి చేరబోనని, న్యాయవాదిగా కొనసాగుతానని జీవి స్పష్టం చేశారు. తనకు అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఏ పార్టీలోకి చేరబోనని జీవి తాను విడుదల చేసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
ప్రభుత్వం ఆమోదం..ఫైబర్ నెట్ ఎండీ బదిలీ
జీవి రెడ్డి రాజీనామా చేసిన తక్కువ సమయంలోనే ప్రభుత్వం ఆయన రాజీనామాను ఆమోదించింది. దీంతోపాటు వివాదానికి ముగింపు పలకడానికి ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేసింది. దినేష్‌కుమార్‌ను జీఎడీలో రిపోర్టు చేయాలని ఆదేశాలు వెలువరించింది.మొత్తంగా జీవి, దినేష్ రెడ్డి వ్యవహారం చంద్రబాబు సర్కార్‌కు తలనొప్పి తెచ్చిపెట్టిందని విశ్లేషకులు అంటున్నారు.