కాకినాడ జిల్లాలో శివరాత్రి మహోత్సవాలు సోమవారం(24) నుండి ప్రారంభంకానున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రమైన పిఠాపురం పాదగయలోని కుక్కుటేశ్వరుడి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాదగయలో కుక్కుటేశ్వరుడి కళ్యాణం సోమవారం రాత్రి జరగనుంది. 25న గ్రామోత్సవం, 26న మహాశివరాత్రి, 27న రథోత్సవం, 28న త్రిశూల స్నానము, 28న స్వామిఅమ్మవార్ల తెప్పోత్సవము, శ్రీపుష్పోత్సవముతో ఉత్సవాలు ముగుస్తాయి.
26న జరిగే శివరాత్రి రోజున పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలా చరించేందుకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు.అదే రోజు రాత్రి 8 గంటలకు లింగోద్భవ కాలాభిషేక పూజ జరగనుంది. కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహణ్, ఎస్పీ బిందుమాధవ్ పర్యవేక్షణలో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా రాజకీయ పార్టీలకు సంబంధించి నాయకులు దర్శనాల విషయంలో ప్రాదాన్యత తగ్గించారు. ప్రొటోకాల్, వీఐపీల దర్శనాలకు ప్రత్యేక సమయాలు కేటాయించనున్నారు. దివ్యాంగులు, చిన్నారులు, వృద్దుల స్నానాలకు పైపుల ద్వారా జల్లు స్నానాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ తెలిపారు.