Search
Close this search box.

  ఢిల్లీ సిఎం ఎవరు..? వీడని సస్పెన్స్.. ముఖ్యమంత్రి నిర్ణయంపై బిజేపీ..

దేశ రాజధాని ఢిల్లీలో 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత భారతీయ జనతా పార్టీ (బిజేపీ) అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కమలం పార్టీ నాయకులు తొందరపాటు పనికి రాదని భావిస్తున్నారు. ఇందుకు గత అనుభవాలతో పాటు ప్రస్తుత సామాజిక పరిస్థితులు కారణాలను వారు పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ కొన్ని సర్‌ప్రైజ్‌లను ప్రకటించనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

 

ఢిల్లీకి 1991లో పాక్షిక రాష్ట్ర హోదా లభించింది. 1993 సంవత్సరంలో ఢిల్లీలో తొలిసారి పూర్తి స్థాయి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే.. ఆ అయిదేళ్ల కాలంలో రాజకీయ ఒత్తిళ్లు, పరిస్థితులు, ప్రజల అసంతృప్తి కారణంగా ముగ్గురు ముఖ్యమంత్రులు.. మదన్‌ లాల్‌ ఖురానా, షాహిబ్‌ సింగ్‌ వర్మ, సుష్మా స్వరాజ్‌ లను మార్చాల్సి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ అధికారం కోల్పోయి.. మళ్లీ ఇన్నేళ్లు ఎన్నికల్లో విజయం కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఇప్పుడు, సుదీర్ఘ కాలం తర్వాత దక్కిన అధికారాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది.

 

సిఎం ఎంపిక విషయంలో బిజేపీ అధిష్ఠానం అనూహ్య నిర్ణయాలు

ఇటీవల గెలిచిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల అంచనాలను కూడా మించిపోయాయి. మధ్యప్రదేశ్‌కు మోహన్‌ యాదవ్‌, రాజస్థాన్‌కు భజన్‌ లాల్‌ శర్మ, ఛత్తీస్‌గఢ్‌కు విష్ణుదేవ్ సాయ్‌లను ఎంపిక చేయడం ఇందుకు నిదర్శనం. ఇందులో, రాజస్థాన్‌ విషయంలో తొలిసారిగా ఎమ్మెల్యేగా నెగ్గిన భజన్‌ లాల్‌కు ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ విషయంలో కూడా ఇలాంటి సర్‌ప్రైజ్‌ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

 

బిజేపీ పాలిత రాష్ట్రాల్లో సేమ్ ఫార్ములా రిపీట్

ఢిల్లీ కోసం ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రుల ఫార్ములాను బీజేపీ అనుసరిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఇదే పద్ధతిని అవలంభిస్తోంది. అలాగే, ఢిల్లీని బీజేపీ మినీ ఇండియాగా భావిస్తోంది. బీజేపీ విజయంలో సిక్కులు, పూర్వాంచలీ, పంజాబీలు, ఉత్తరాఖండీ, వైశ్యాస్‌, జాట్‌ వంటి అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం వహించారని పార్టీ నాయకులు భావిస్తున్నారు. కాబట్టి, డిప్యూటీ ముఖ్యమంత్రుల ఎంపికలో కూడా సామాజిక సమీకరణను ప్రధానంగా పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది.

 

సిఎం రేసులో ఉన్నది వీరే..

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేష్‌ వర్మ పేరు ఈ రేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ బీజేపీ మాజీ అధ్యక్షులు విజేందర్‌ గుప్తా, సతీష్‌ ఉపాధ్యాయలతో పాటు సీనియర్‌ నేతలు పవన్‌ శర్మ, మంజీందర్‌ సింగ్‌ సిర్సా, అశిష్‌ సూద్‌, మహిళా నేతలు శిఖా రాయ్‌, రేఖా గుప్తా పేర్లు కూడా ప్రస్తావనలో ఉన్నాయి. ఇక, కొత్తగా ఎమ్మెల్యేలుగా నెగ్గిన కర్నైల్‌ సింగ్‌, రాజ్‌కుమార్‌ భాటియా పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి. అలాగే.. హ్యాట్రిక్‌ ఎంపీ మనోజ్‌ కుమార్‌ తివారీ (సింగర్‌), కేంద్ర మంత్రి హర్ష్‌ మల్హోత్రా పేర్లను కూడా బిజేపీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

 

ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో బీజేపీ జాతీయ నాయకత్వం ఇప్పటికే ఢిల్లీ బీజేపీ వర్గాలతో సంప్రదింపులు జరుపుతోంది. ముఖ్యమంత్రి రేసుతో పాటు కేబినెట్‌ కోసం పలువురి పేర్లతో కూడిన జాబితాను పరిశీలిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీది అవినీతి ప్రభుత్వంగా పేర్కొంటూ బీజేపీ ప్రచారం చేస్తూ కేజ్రీవాల్ బృందాన్ని గద్దె దించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికలో కుల సమీకరణతో పాటు ‘క్లీన్ ఇమేజ్’ను కూడా పరిగణనలోకి తీసుకుంటోందని సమాచారం. బీజేపీ అగ్రనేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నుంచి రాగానే బీజేపీ అగ్రనేతలతో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నారు. అలాగే సోమవారం లేదా మంగళవారం బీజేపీ సమావేశం జరగనుంది. ఆ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి ఎంపికపై స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ నెల 19 లేదా 20వ తేదీన ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు