Search
Close this search box.

  కొత్త పన్ను స్లాబులపై పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి ప్రకటన..

మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో కొత్త ఆదాయపు పన్ను సవరణలపై ప్రతిపాదనలు చేసిన నిర్మలా సీతారామన్.. అందుకు సంబంధించిన కొత్త పన్ను విధానాలపై డైరెక్ట్ ట్యాక్స్ – ఇన్ కమ్ ట్యాక్స్ 2025 బిల్లును పార్లమెంట్ ముందుకు ప్రవేశ పెట్టారు. ఈ విధానంలో దేశంలోని పన్నుదారులు చెల్లించే స్లాబులు ఏ మేరకు ఉండనున్నాయి, ఎలా పన్ను విధింపులు అనుసరించనున్నారనే విషయంపై క్లారిటీ రానుంది. ఆదాయపు పన్ను బిల్లు 2025.. తదుపరి సమీక్ష కోసం లోక్ సభ సెలెక్ట కమిటీకి పంపించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పీకర్ ను కోరారు. అనంతరం లోక్ సభ కార్యకలాపాలు మార్చి 10 వరకు వాయిదా పడ్డాయి.

 

ఇప్పటి వరకు అనుసరిస్తున్న ప్రత్యక్ష పన్నుల స్థానంలో కొత్త పన్ను విధానాన్ని అమలు చేస్తున్న కేంద్రం.. ఈ విధానంలో చెల్లింపుల ప్రక్రియ, స్లాబుల విధానాన్ని సరళీకరించింది. దేశంలో 60 ఏళ్ల క్రితం 1961 నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో.. తాజాగా ప్రవేశపెట్టిన నూతన చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. దీంతో.. ఆర్థిక కార్యకలాపాల్లో ఇదో విప్లవాత్మక మార్పుగా చెబుతున్నారు. ప్రస్తుత ప్రతిపాదిత చట్టాన్ని ఇన్ కమ్ టాక్స్ -2025గా వ్యవహరించనున్నారు. కాగా.. ఇది కొత్త ఆర్థిక ఏడాదిలో అంటే ఏప్రిల్ 2026 నుంచి అమలులోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ చట్టం ద్వారా అనేక సంక్లిష్టతలతో కూడుకున్న పన్ను చట్టాలను ఏకీకృతం చేసేందుకు ఉద్దేశించిందిగా అధికారులు చెబుతున్నారు.

 

నూతన ఆదాయపు పన్ను బిల్లు 2025 లోక్ సభలో ప్రవేశపెట్టినప్పటికీ.. ఉభయ సభల్లో ఆమోదం పొందేందుకు ఇంకా కొంత సమయం పడుతుందని అధికారులు తెలుపుతున్నారు. అన్ని స్థాయిల్లో కసరత్తు పూర్తయ్యి.. ముసాయిదాగా రూపొందిన బిల్లు తొలుత ఆర్థిక మంత్రి ద్వారా పార్లమెంట్ లోని లోక్ సభ ముందుకు వచ్చింది. అక్కడ నుంచి సెలెక్షన్ కమిటీకి వెళ్లిన బిల్లును.. అక్కడ పూర్తిగా అధ్యయనం చేసి, కేంద్ర క్యాబినేట్ కు నివేదిక సమర్పిస్తారు. ఆ సిఫార్సులను పరిశీలించిన తర్వాత ఏవైనా మార్పు చేర్పులు ఉంటే కేంద్ర క్యాబినేట్ ద్వారా అధికారికంగా నిర్ణయిస్తారు. అక్కడి నుంచి చివరిగా తుది మార్పులతో మరోసారి పార్లమెంట్ ముందుకు బిల్లు రూపంలో వస్తుంది. అప్పుడు.. రెండు సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి దగ్గరకు వెళ్లనుంది. అక్కడ రాజ్యముద్ర వేసుకున్న తర్నాతే.. నూతన చట్టంగా దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని అధికారులు వెల్లడించారు.

 

కొత్త పన్ను చట్టంలో ఏముంది

 

ఆదాయపు పన్ను బిల్లు 2025.. దేశ పన్ను చట్టాలను ఏకీకృతం చేస్తుంది. పన్ను చెల్లింపుదారులకు నిబంధనల్ని సరళీకృతం చేయనుంది. అలాగే.. కొత్త పన్ను కోడ్ ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టంలోని వినియోగంలో లేని అనేక నిబంధనలు, ఆంక్షలను తొలగిస్తుంది. అనేక లిటిగేషన్లకు పరిష్కారం చూపనుందని అధికారులు అంటున్నారు. కొత్త బిల్లులో భాషను సులభతరం చేశారు. ఎక్కువగా టెక్నికల్ పదాల కంటే వాడుకలోని పదాలను వినియోగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే.. పాత పదాలను నేటి ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా కొత్త పదాలతో భర్తీ చేస్తుంది.

 

ఆదాయపు పన్ను బిల్లు 2025.. వ్యాపారాలు, లాభాపేక్షలేని సంస్థలకు పన్ను విధానాలలో మెరుగైన స్పష్టత కోసం పన్ను చట్టాలను సులభతరం చేస్తుంది. ఈ మార్పులు పన్ను సమ్మతిని సులభతరం చేస్తాయని అధికారులు భావిస్తున్నారు. అలాగే.. ఈ బిల్లు పెట్టుబడులు, విరాళాలు, నిర్దిష్ట ఖర్చులకు తగ్గింపులకు సంబంధించిన మార్పులను తీసుకువస్తుంది. గతంలో, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్లు 10, 80C నుంచి 80U వరకు.. పెట్టుబడులు, విరాళాలు, నిర్దిష్ట ఖర్చులకు తగ్గింపులను అనుమతించాయి.

 

అలాగే.. కొత్త బిల్లులోని… క్లాజులు 11 నుంచి 154 వరకు.. ఈ తగ్గింపులను ఏకీకృతం చేస్తుంది. స్టార్టప్‌లు, డిజిటల్ వ్యాపారాలు, పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు మద్దతు ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తుందని అంటున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు