ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు (వాలెంటైన్స్ డే) జరుపుకోవాలనుకునే యువతకు బజరంగ్ దళ్ అంటే భయం. పార్కులు, రోడ్ల వెంబడి జంటలు కనిపిస్తే వారికి బలవంతంగా వివాహం చేస్తామని బజరంగ్ దళ్ నేతలు హెచ్చరిస్తున్నారు. అయితే.. తాము ప్రేమికుల రోజున పెళ్లిళ్లు చేయించే కార్యక్రమాలు నిర్వహించడం లేదని, బదులుగా పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్లను స్మరించుకుని “వీర జవాన్ దివస్”గా నిర్వహించాలని వారు స్పష్టం చేశారు. “బ్యాన్ వాలెంటైన్స్ డే – ప్రమోట్ వీర జవాన్ దివస్” అనే నినాదంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు యువతకు పిలుపునిచ్చారు.
బజరంగ్ దళ్ తెలంగాణ కన్వీనర్ శివరాములు తాము నిజమైన ప్రేమకు వ్యతిరేకం కాదని, కానీ ప్రేమికుల రోజు పేరుతో జరిగే వికృత చేష్టలకు మాత్రమే వ్యతిరేకులమని స్పష్టం చేశారు. పార్కులు, పబ్లిక్ ప్రదేశాలు, క్లబ్బుల్లో వాలెంటైన్స్ డే కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. యువతీ యువకులు అమరులైన వీర జవాన్లను స్మరించుకుని వీర జవాన్ దివస్‌లో పాల్గొనాలని బజరంగ్ దళ్ నేతలు పిలుపునిచ్చారు.
2019 ఫిబ్రవరి 14న కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన దాడిలో అమరులైన జవాన్లను స్మరించుకుని.. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ నేతలు కోరారు. దేశ రక్షణలో తమ ప్రాణాలను అర్పించిన వీరులను గౌరవించడం, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి కర్తవ్యమని వారు పేర్కొన్నారు.
వాలెంటైన్స్ డే చరిత్ర.. స్త్రీలకు కొరడా దెబ్బలు
వాలెంటైన్స్ డేకు మూలాలు పురాతన రోమన్ పండుగ “లూపెర్కాలియా”కు చెందినవిగా చరిత్రకారులు అంటారు. ఈ పండుగ ఫిబ్రవరి 13 నుండి 15 వరకు నిర్వహించబడేది. ఇది సంతానోత్పత్తికి సంబంధించిన పండుగగా పరిగణించబడేది. ఈ పండుగ సమయంలో.. రోమన్ పురుషులు.. సంతానం లేని తమ భార్యలను కొరడాలతో కొట్టేవారు. ఇది సంతాన సామర్థ్యాన్ని పెంచుతుందని వారు నమ్మేవారు. అలాగే మేకలను బలి ఇచ్చేవారు. ఈ పండుగ తర్వాత క్రైస్తవ మతంలో వాలెంటైన్స్ డేగా మారిందని చెప్పుకుంటారు.
5వ శతాబ్దంలో పోప్ గెలాసియస్-1 ఫిబ్రవరి 14ని వాలెంటైన్స్ డేగా ప్రకటించి.. రోమన్ పండుగను రద్దు చేశారని కొందరు చరిత్రకారులు అంటారు. ఈ రోజు సెయింట్ వాలెంటైన్ అనే క్రైస్తవ సాధువు పేరుమీద పెట్టబడిందని కూడా ఒక ప్రచారం ఉంది. అతను రోమ్‌లో మరణించినట్లు చరిత్రకారులు నమ్ముతారు.
15వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఫిబ్రవరి 14న శృంగార ప్రేమకు గుర్తుగా వాలెంటైన్స్ డే పండుగను జరుపుకునేవారని చరిత్రకారులు తెలిపారు. ఆ రోజున యువ జంటలు ఆడుతూ పాడుతూ.. విలాసవంతమైన విందులతో సమయాన్ని గడిపేవారు. భర్తలు తమ భార్యలకు ప్రేమ లేఖలు రాసేవారు, ఇది ఆనాటి సంప్రదాయంగా మారింది.
గ్రీటింగ్ కార్డుల చరిత్ర
వాలెంటైన్స్ డేకు గ్రీటింగ్ కార్డులు ఇచ్చుకోవడం అనే సంప్రదాయం 18వ శతాబ్దంలో మొదలైంది. ఆ సమయంలో కాగితాలపై ముద్రించిన గ్రీటింగ్ కార్డులు అందుబాటులో లేకపోవడంతో, ప్రజలు చేతితో ఆకులు, పువ్వులు, ఇతర సహజ వస్తువులతో గ్రీటింగ్ కార్డులను తయారు చేసేవారు. ఈ కార్డులపై కవితలు రాసి.. ప్రేమికులకు ఇచ్చి తమ భావాలను వ్యక్తపరిచేవారు.
18వ శతాబ్దపు గ్రీటింగ్ కార్డులు ఇప్పటికీ లండన్ మ్యూజియంలో సంరక్షించబడి ఉన్నాయి. 1913లో మొట్టమొదటిసారిగా వాలెంటైన్స్ డేకి వాణిజ్యపరంగా గ్రీటింగ్ కార్డులు అమ్మకం ప్రారంభమైంది. ఈ కార్డులు అందమైన చిత్రాలు, కవితలతో అలంకరించబడి ఉండడంతో తక్కువ సమయంలోనే ప్రజల మన్నన పొందాయి. ఈ రోజు వరకు వాలెంటైన్స్ డే కార్డులు ప్రేమికుల మధ్య ప్రేమను వ్యక్తపరచడానికి ప్రధాన సాధనంగా మారాయి.