తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులపై బెంగళూరులోని సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నాడు అక్రమాస్తుల కేసులో జయలలిత అరెస్టు కావడం అందరికీ తెలిసిందే. ఆ సమయంలో అంటే 2004లో ఆమె ఆస్తులను సీజ్ చేయడం జరిగింది. కొన్ని వందల కోట్లు విలువ చేసే ఆస్తులను జప్తు చేయడం జరిగింది. ఇక అప్పటి నుంచి ఆ కేసు విచారణలో ఉంది. ఈ క్రమంలోనే జయలలిత అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ మరణించారు.ఇక ఈ ఆస్తుల కేసును విచారణ చేసిన బెంగళూరు సీబీఐ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
జయలలిత ఆస్తులు
తమిళనాడు మాజీ సీఎం జయలలితకు కొన్ని వేల కోట్లు విలువ చేసే ఆస్తులున్నాయి. ఇందులో చెన్నైలోని తన నివాసం పోయెస్ గార్డెన్ నుంచి, బ్యాంకు డిపాజిట్లు, 700 కిలోలకు పైగా వెండి ఆభరణాలు,27 కిలోల బంగారం,1562 ఎకరాల భూమి, వజ్రాభరణాలు, ఖరీదైన రంగురాళ్లు,11వేలకు పైగా చీరెలు,44 ఏసీలు, 750 జతల ఖరీదైన చెప్పులతో పాటు గడియారాలు ఇంకా చాలా విలువైన వస్తువులు ఆమె వద్ద ఉన్నాయి. ఇక ఆమె మరణం తర్వాత ఈ ఆస్తుల ఎవరికి చెందాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వంకు అప్పగించాలని బెంగళూరులోని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
మేనల్లుడు, మేన కోడలకు షాక్..
కేసును విచారణ చేసిన బెంగళూరు 36వ అడిషనల్ సిటీ సివిల్ సెషన్స్ కోర్టు జడ్జి జస్టిస్ హెచ్ఏ మోహన్..ఫిబ్రవరి 14,15వ తేదీల్లోగా జయలలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. అంతకుముందు సీజ్ చేయబడ్డ ఆస్తులను తమకు చెందేలా ఆదేశించాలంటూ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు జయలలిత మేనల్లుడు జె దీపక్, మేనకోడలు జె.దీప. అయితే ఈ పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు జనవరి 13వ తేదీన కొట్టేసింది. ఆ వెంటనే సీబీఐ కోర్టు జయలలిత ఆస్తులపై ఒక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు కంటే ముందు సీబీఐ కోర్టును ఆశ్రయించగా ఇదే న్యాయమూర్తి జస్టిస్ హెచ్ఏ మోహన్ జయలలిత అవి అక్రమంగా సంపాదించారంటూ జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ దీపక్ దీపాలు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి చుక్కెదురైంది.
కేసు పూర్వాపరాలు
మార్చి 2024లోనే జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని ఆదేశాలు ఇవ్వగా.. జయలలిత వారసులు కర్నాటక హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు.ఇక స్టే వెకేట్ కావడంతో ప్రస్తుతం సీబీఐ కోర్టు ఆదేశాలు అమలు కానున్నాయి.1996 డిసెంబర్ 7 నుంచి 1996 డిసెంబర్ 12 మధ్య జరిగిన సెర్చ్ ఆపరేషన్‌లో జయలలితకు చెందిన చరాస్తులు, స్థిరాస్తులు వెలుగులోకి వచ్చాయి. ఆమె ఆస్తులను చూసి చాలా మంది షాక్‌కు గురయ్యారు. ఇక కర్నాటక హైకోర్టు వారసులు వేసిన పిటిషన్‌ను విచారణ చేస్తూ జయలలిత పేరుతో ఒక చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి మంచి పనులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది.
మొత్తానికి సీబీఐ కోర్టు తాజా ఆదేశాలతో జయలలిత అక్రమాస్తుల కేసు ముగింపు దశకు చేరుకుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత ఆస్తులు అప్పచెప్తే ఇక కేసును మూసివేయొచ్చని అంటున్నారు. సుప్రీంకోర్టు కూడా తొలుత ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.









