పశ్చిమగోదావరి జల్లాలో తాజాగా పార్శిల్ బుక్ చేస్తే డెడ్ బాడీ వచ్చిన ఘటనలో మిస్టరీ వీడింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దాదాపు 100 మంది సిబ్బందిని కేటాయించి మరీ ఈ మిస్టరీని ఛేదించారు. ఆస్తి కోసం వదినను భయపెట్టేందుకు ఓ అమాయకుడిని చంపేసి మృతదేహాన్ని పార్ళిల్ లో ఆమె ఇంటికి మరిదే పంపాడని పోలీసులు తేల్చారు. ఈ వ్యవహారంలో మొత్తం ముగ్గురిని నిందితులుగా తేల్చారు.
రంగరాజు అనే వ్యక్తికి ముగ్గురు కుమార్తెలు ఉండగా.. అందులో తులసి ఇంటికి ఈ శవం పార్శిల్ వచ్చింది. తన చెల్లెలు రేవతిని పెళ్లి చేసుకున్న శ్రీధర్ వర్మ అనే వ్యక్తి తన ప్రియురాలు సుష్మ, భార్యతో కలిసి పర్లయ్య అనే అమాయకుడిని నైలాన్ తాడుతో చంపేసి ఆ శవాన్ని తులసి ఇంటికి పంపారు. చెక్క పెట్టెలో వచ్చిన పార్సిల్ చూసి షాకైన తులసి పోలీసులను ఆశ్రయించగా.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇవాళ ఆ మిస్టరీ ఛేదించి వివరాలు వెల్లడించారు. ఇందులో శ్రీధర్ వర్మ భార్య తులసి, ప్రియురాలు సుష్మతో పాటు మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. అలాగే సుష్మకూ మూడు పెళ్లిళ్లు జరిగాయని తేలింది.
ఇంతకీ ఈ పర్లయ్య అనే అమాయకుడిని ఎందుకు చంపారన్నదే అసలు మిస్టరీ. తనకంటూ ఎవరూ లేని పర్లయ్యను శ్రీధర్ వర్మ, భార్య రేవతి, ప్రియురాలు సుష్మ కలిసి చంపేసి దాన్ని వదిన తులసికి పంపారు. తండ్రి రంగరాజు ఆస్తిలో వాటా కోసం తులసి రాకుండా భయపెట్టేందుకే ఈ పని చేసినట్లు వారు దర్యాప్తులో అంగీకరించారు. ముందు ఇల్లు కట్టుకుంటున్న తులసికి క్షత్రియ సేవాసమితి పేరుతో నిర్మాణ సామాగ్రి పంపడం మొదలుపెట్టిన వీరు.. అనంతరం శవం పంపి భయపెట్టాలని చూసారు. కానీ ఆమె భయపడకుండా పోలీసుల్ని ఆశ్రయించడంతో వీరంతా ఇరుక్కున్నారు.