భారత దేశ మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గురువారం డిసెంబర్ 26, 2024 రాత్రి మరణించారు. ఆయన మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులపాటు సంతాప దినాలు ప్రకటించింది.
ఆర్థిక నిపుణుడు అపరమేధావి అయిన మన్మోహన్ సింగ్.. 1991లో భారత దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో వ్యవస్థను గాడిలో పెట్టే అతిక్లిష్టమైన బాధ్యతలు ఆర్థిక మంత్రిగా తన భుజాన వేసుకున్నారు. అనతి కాలంలోనే దివాళా అంచున ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను ఆయన పరుగులు పెట్టించారు. ఆ తరువాత కూడా 2004 నుంచి 2014 వరకు పది సంవత్సరాల పాటు ఆయన దేశ ప్రధాన మంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు.
92 ఏళ్ల మన్మోహన్ సింగ్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఊపిరి తీసుకోవడంలో సమస్యగా ఉండేది. దీంతో ఆయనకు ఎయిమ్స్ డాక్టర్లు చికిత్స అందించేవారు. ఈ క్రమంలో డిసెంబర్ 26, 2024న మన్మోహన్ సింగ్ తన నివాసంలో అపస్మారక కనిపించడంతో ఆయనను రాత్రి 8:06 గంటలకు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో మెడికల్ ఎమర్జెన్సీ కోసం తీసుకొచ్చారు.
ఎయిమ్స్ డాక్టర్లు ఆయనను స్పృహలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో డాక్టర్లు గురువారం రాత్రి 9:51 గంటలకు మన్మోహన్ సింగ్ మరణించారని ధృవీకరిస్తూ ప్రకటన జారీ చేశారు.
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేంద్ర ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. శుక్రవారం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రులందరూ సమావేశం కానున్నారు. సమావేశం తరువాత మన్మోహన్ సింగ్ అంతక్రియలు అన్ని ప్రభుత్వ లాంఛనాలతో జరుగునున్నాయని సమాచారం.
మరోవైపు కర్టాటక ప్రభుత్వం కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏడు రోజుల పాట సంతాప దినాలు ప్రకటించింది. శుక్రవారం డిసెంబర్ 27, 2024న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం సెలవు కూడా ప్రకటించింది.
మృదుస్వభావం గల ప్రధాని మన్మోహన్ సింగ్
1932 సంవత్సరం పంజాబ్ రాష్ట్రంలో జన్మించిన మన్మోహన్ సింగ్ పదేళ్ల పాటు భారత దేశ ప్రధాన మంత్రిగా కొనసాగారు. 2004లో అటల్ బిహారి వాజ్ పేయి ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు పోటీగా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ప్రధాన మంత్రి పదవి కట్టబెట్టింది. ఆ తరువాత ఆయన మళ్లీ 2009 లోనూ రెండో సారి ప్రధాని పదవి చేపట్టారు. కానీ 2014 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తరువాత నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారు.
పదేళ్ల పాటు విజయవంతంగా దేశానికి పరిపాలన అందించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ చాలా మృదు స్వభావి. ఒక మిత భాషి. ఆయన ఎంత నిశ్శబ్దంగా రాజకీయాల్లోకివ వచ్చారో.. అంతే నిరాడంబరంగా రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన రాజ్య సభ సభ్యత్వం నుంచి ఏప్రిల్ 2024లో రిటైర్మెంట్ తీసుకున్నారు. 33 ఏళ్ల సదీర్థ రాజకీయ ప్రస్థానం కొనసాగించిన మన్మోహన్ సింగ్ ఏ వేడుకలు, సంబరాలు లేకుండానే రాజకీయ జీవితానికి స్వస్తి పలికారు.
చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుంది
ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ప్రతిపక్షాలు బలహీన ప్రధాని అని విమర్శలు చేసేవి. అయితే 2014లో ప్రధాన మంత్రి హోదాలో ఆయన చివరి సారిగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆయనను చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని. అప్పటి మీడియాలో తనపై వచ్చే విమర్శులు భవిష్యత్తులో ప్రభావం కోల్పోతాయని.. తనను చరిత్ర కృపా దృష్టితో చూస్తుందని వ్యాఖ్యానించారు. “ఒక బలహీన ప్రధాన మంత్రిగా ఇన్నాళ్లు కొనసాగినట్లు నేను భావించడం లేదు. దీనికి కారణం కూడా ఉంది. నా పదేళ్ల పదవికాలంలో నన్ను ప్రధాని పదవికి రాజీనామా చేయమని ఒక్కరు కూడా అడగలేదు. ఇది చాలా నేను బలహీన ప్రధాని కాదని చెప్పడానికి. నాకు ఎదురైన పరిస్థితుల్లో రాజకీయా వివశత దృష్ట్యా నేను శక్తిమేర నిర్ణయాలు తీసుకున్నాను.” అని మన్మోహన్ ప్రతిపక్షాల నోర్లు మూయించారు.