తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నటుడు ప్రకాష్ రాజ్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ.. తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారని, ఇది రాష్ట్ర సమస్య అని, మీరు అధికారంలో ఉన్నారని, నిజాలు బయటకు తీసి,బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌కు హితవు పలికారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
అసలు లడ్డూ వివాదానికి ప్రకాష్ రాజ్‌కు ఏం సంబంధం ఉందని మాట్లాడుతున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేను ఏ మతాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని, అలాంటప్పుడు ప్రకాష్ రాజ్‌కు ఎందుకు ఈ వివాదంపై స్పందిస్తున్నారని పవన్ నిలదీశారు. అప్పటి నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకుని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళ హీరో కార్తీ చేత పవన్ కల్యాణ్ సారీ చెప్పించుకున్న ఘటనపై ప్రకాష్ రాజ్ రియాక్ట్ అయ్యారు.”చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్” అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. మరోసారి పవన్ కల్యాణ్‌పై ఆయన పరోక్షంగా ట్వీట్ చేశారు. ”గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?” అంటూ ప్రకాష్ ట్వీట్ చేశారు.
తమిళనాడులో ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ ఈ సందర్భంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌పై ప్రశంసలు కురిపించారు.ఉదయనిధి స్టాలిన్ సమానత్వం గురించి మాట్లాడుతున్నారు. మరో డిప్యూటీ సీఎం సనాతన ధర్మం అంటూ తన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ పవన్ కల్యాణ్‌కు పరోక్షంగా చురకలు అంటించారు.నేను ప్రశ్నిస్తే భయపడుతున్నారు. నేను ఎప్పటికీ బలహీన వర్గాల తరఫున మాట్లాడతానంటూ ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. తాజాగా ఆయన మరోసారి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
తాజాగా ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ను రాజకీయాల్లో “ఫుట్‌బాల్”తో పోల్చారు. పవన్ కల్యాణ్‌ను వాడుకొని రాజకీయ ప్రయోజనాలు సాధించుకుంటారని ప్రకాశ్ రాజ్ అభిప్రాయపడ్డారు. బీజేపీ వంటి పార్టీల ప్రభావానికి అతను లోనవుతున్నారని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ చెప్పిన సనాతన ధర్మం ప్రమాదంలో ఉందన్న వ్యాఖ్యలను ప్రకాశ్ రాజ్ తప్పుపట్టారు. హిందూ మతం లేదా సనాతన ధర్మం ప్రమాదంలో లేదనీ, కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని అన్నారు. అదేవిధంగా, నటనలో వేర్వేరు పాత్రలు పోషించవచ్చని, కానీ రాజకీయాల్లో ఒక స్థిరమైన దిశలోనే నడవాలంటూ పవన్ కల్యాణ్‌కు ప్రకాష్ రాజ్ హితవు పలికారు