పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పతకాల వేట ముగిసింది. మొత్తం 117 మంది అథ్లెట్లతో 16 రకాల క్రీడాంశాల బరిలో నిలిచిన భారత్ 11 పతకాల లక్ష్యాన్ని చేరుకోడంలో విఫలమయ్యింది. చివరకు 6 పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కనీసం ఒక్క బంగారు పతకమూ సాధించలేకపోయింది. పొరుగుదేశం పాకిస్థాన్ కంటే పతకాల పట్టికలో 8 స్థానాలు దిగువకు పడిపోయింది.
టోక్యో వేదికగా ముగిసిన 2020 ఒలింపిక్స్ లో అంచనాలకు మించి రాణించిన భారత అథ్లెట్లు, ప్రస్తుత పారిస్ ఒలింపిక్స్ లో మాత్రం తేలిపోయారు. స్వర్ణాలు తెస్తారనుకొన్న వినేశ్ పోగట్, నీరజ్ చోప్రాలను దురదృష్టం నీడలా వెంటాడింది. జావలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా చివరకు రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. షూటింగ్ లో మూడు, హాకీ, కుస్తీ అంశాలలో ఒక్కో కాంస్యం సాధించ డంతో భారత్ ఓ రజత, ఐదు కాంస్యాలతో సహా మొత్తం 6 పతకాలతో పతకాల పట్టిక 71వ స్థానానికి పడిపోయింది. గత ఒలింపిక్స్ కంటే ఎక్కువ పతకాలు సాధించాలన్న భారత ఒలింపిక్స్ సంఘం లక్ష్యం నెరవేరలేదు.