మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన తాజా తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’. సాత్విక వీరవల్లి, శృతిహాసన్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు పవన్ సాధినేని దర్శకత్వం వహించారు. స్వప్న సినిమాస్, లైట్ బాక్స్ మీడియా, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం ఈ చిత్రాన్ని నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించగా, ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. సుజిత్ సారంగ్ సినిమాటోగ్రఫీ అందించారు.
టీజర్, ట్రైలర్‌తో పాటు ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా, నవంబర్ 19 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
ప్రీమియర్ షోల నుంచి వస్తున్న తొలి స్పందన ప్రకారం ‘ఆకాశంలో ఒక తార’ ఫస్టాఫ్ ఆకట్టుకునేలా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ భావోద్వేగ సన్నివేశాలు హృదయానికి హత్తుకునేలా ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని కామెంట్స్ చేస్తున్నారు.
సాత్విక వీరవల్లి తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుందని, ఆమె క్లోజప్ షాట్స్ చాలా బాగా వచ్చాయని ఓ నెటిజన్ పేర్కొన్నారు. అలాగే రుహానీ శర్మ చేసిన క్యామియో కూడా బాగుందని ప్రశంసించారు.
మరోవైపు దుల్కర్ సల్మాన్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని అభిమానులు అంటున్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో ఆయన నటన, వాటికి జీవీ ప్రకాష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఆసక్తికరంగా సాగిందని, సెకండాఫ్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయని చెబుతున్నారు.
ఇక మరికొందరు ప్రేక్షకులైతే ట్రైలర్ చూసినప్పుడే ఇదొక మంచి క్లాసిక్ సినిమా అవుతుందని భావించామని, ప్రీమియర్ షోల నుంచి కూడా పాజిటివ్ స్పందన వస్తోందని పేర్కొంటున్నారు. తెలుగులో దుల్కర్ సల్మాన్ ఎంచుకుంటున్న కథలు ప్రతిసారీ ప్రత్యేకంగా ఉంటున్నాయని అభిమానులు ప్రశంసిస్తున్నారు.
మొత్తానికి ‘ఆకాశంలో ఒక తార’ ఫస్టాఫ్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. దుల్కర్, సాత్వికల నటన, భావోద్వేగ సన్నివేశాలు, సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. అయితే సెకండాఫ్ ఎలా ఉండబోతోంది? ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పిస్తుందా? అనేది తెలియాలంటే పూర్తి సినిమా చూడాల్సిందే.









