టాలీవుడ్లో తన ఎనర్జిటిక్ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ఓ సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు హీరోగా ప్రేక్షకులను అలరించిన రామ్, ఈసారి దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. తన స్వీయ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారు. మరోవైపు కోలీవుడ్‌లో విలన్ పాత్రలోనూ కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇక తన కొత్త సినిమా కోసం రామ్ పూర్తిగా డిఫరెంట్ లుక్‌ను సిద్ధం చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయనను కొత్త అవతార్‌లో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా తన సినిమా నుంచి ఓ ఆసక్తికరమైన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ పోస్టర్లో రామ్ భారీ సెట్ మధ్యలో మెట్లపైకి వెళ్తూ కనిపిస్తున్నారు. ఒక చేతిలో టెడ్డీ బేర్, మరో చేతిలో మెషిన్ గన్ పట్టుకుని ఉన్న ఆయన లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పోస్టర్‌తో అభిమానులకు మెన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.
అంతేకాకుండా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీంతో రామ్ కొత్త సినిమా టైటిల్ ఎలా ఉండబోతుందో, ఆయన పాత్ర ఏ విధంగా ఉండబోతుందోనని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
ఇక ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందిస్తుండగా, రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. మరి దర్శకుడిగా రామ్ తన తొలి ప్రయత్నంతో ఎలాంటి సంచలనం సృష్టిస్తారో, ఈ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తారో చూడాలి.









