ఈనెల 1న జరిగిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మంగళవారం ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు చేశారు. టేబుళ్లను ఏర్పాటు చేసి, రౌండ్ల వారీగా ఫలితాలను తేల్చనున్నారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కాకినాడ జిల్లాలో లెక్కింపు కేంద్రాల వద్ద అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మొత్తం 96 కౌంటింగ్ టేబుళ్ల ను సిద్ధం చేశారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం, పెద్దాపురం, సామర్లకోట, తుని, గొల్లప్రోలు, ఏలేశ్వరం మున్సిపాల్టీళ్లకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. ఛైర్ పర్సన్ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఫలితాలు రౌండ్ల వారీగా తేలనున్నాయి. తొలుత వార్డుల ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఛైర్ పర్సన్ ఓట్ల ఫలితాలు ప్రకటిస్తారు. ఇప్పటికే పోటీ చేసిన అభ్యర్థులకు వారీ తరపున కౌంటింగ్ ఏజెంట్లకు ఓట్ల లెక్కింపుపై అవగాహన కల్పించారు.
*లెక్కింపు కేంద్రాలివే..*
పెద్దాపురం మున్సిపాల్టీకి సంబంధించి రామారావుపేటలోని బ్రాహ్మణ కళ్యాణ మండపం, సామర్లకోటలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రంలోని యోగా హాల్ ను కేటాయించారు. పిఠాపురానికి సంబంధించి హైవేలోని పాలిటెక్నిక్ కళాశాలను ఎంపిక చేశారు. తుని: బ్యాంక్ కాలనీలోని ప్రభుత్వ జూనియర్ మహిళా కళాశాలను, గొల్లప్రోలులో శ్రీ సేట్ పెరాజీ లుంబాజీ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను కేటాయించారు. ఏలేశ్వరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్కింపు జరగనుంది. పెద్దాపురంలో 16టేబుళ్లను, సామర్లకోటలో 18, పిఠాపురంలో 18, తుని మున్సిపాల్టీలో 18 టేబుళ్ల ను ఏర్పాటు చేశారు. గొల్లప్రోలు మాత్రం 8టేబుళ్లలో ఫలితాలు తేలనున్నాయి. ఏలేశ్వరం మున్సిపాల్టీలో 18 టేబుళ్లను ఏర్పాటు చేశారు.








