విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
దాదాపు 3 నిమిషాల 47 సెకన్ల నిడివి ఉన్న ట్రైలర్లో భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా చూపించారు. ముఖ్యంగా ‘శింగనమల బొబ్బిలి రణబాలి’ పాత్రలో విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆయన యాక్షన్, డైలాగ్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.
1854 నుంచి 1878 మధ్య రాయలసీమలో జరిగిన వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ఈ కథను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. బ్రిటిష్ పాలకుల దమనకాండకు వ్యతిరేకంగా పోరాడిన ఓ వీరుడి కథే ఈ సినిమా. విజయ్‌కు జోడీగా రష్మిక ‘జయమ్మ’ పాత్రలో కనిపించనుంది.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. బ్రిటిష్ అధికారి పాత్రలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. దీంతో ఈ సినిమాకు పాన్ ఇండియా స్థాయిలో మరింత ఆసక్తి ఏర్పడింది.
ఇక ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత విజయ్, రష్మిక జంటగా వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో కూడా భారీ క్రేజ్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు.
మరి ట్రైలర్‌తో మంచి హైప్ క్రియేట్ చేసిన ‘రణబాలి’ సినిమా థియేటర్లలో ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమా అక్టోబర్ 16న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.








