సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలు, వాయిస్‌లను దుర్వినియోగం చేస్తూ ట్రోల్స్, మార్ఫింగ్‌లు చేయడం ఎక్కువైంది. ఇక AI టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ సమస్య మరింత తీవ్రమైంది. ముఖ్యంగా ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ కంటెంట్‌తో సెలబ్రిటీల పరువుకు భంగం కలిగించే ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీరియస్‌గా స్పందించారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను AI సాయంతో అభ్యంతరకరంగా మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించిన ఎన్టీఆర్.. ఈ వీడియోను రూపొందించిన వారిని, దాన్ని ప్రచారం చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని హెచ్చరించారు.
స్త్రీలను గౌరవించడం మన సంస్కృతిలో భాగమని చెబుతూ.. ఒక మహిళను అవమానించేలా AIని ఉపయోగించడం అత్యంత సిగ్గుచేటైన చర్య అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
అంతేకాదు.. ఈ మార్ఫింగ్ వీడియోను సృష్టించిన వారిపైనే కాకుండా, దాన్ని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్న వారిపైనా సాధ్యమైనన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
అదే సమయంలో అభిమానులు, ప్రజలు ఇలాంటి కంటెంట్‌ను చూడవద్దని, షేర్ చేయవద్దని, దానికి ఎలాంటి ప్రచారం కల్పించవద్దని ఎన్టీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈరోజు మరొకరికి జరిగిన విషయం.. రేపు మన కుటుంబంలోని ఎవరికైనా ఎదురుకావచ్చని హెచ్చరించారు.
AI టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకునేలా మరింత బలమైన నిబంధనలు తీసుకురావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఎన్టీఆర్ కోరారు.
ఇక సెలబ్రిటీల ఫోటోలు, పేర్లు, వాయిస్‌లను అనుమతి లేకుండా దుర్వినియోగం చేయడంపై ఇప్పటికే న్యాయస్థానాలు కూడా పలు సందర్భాల్లో ఆదేశాలు జారీ చేశాయి. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగుతుండటంతో.. ఇప్పుడు ఎన్టీఆర్ తీసుకోబోయే తదుపరి చట్టపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది.









