ఇటీవల సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఓటీటీ సంస్థల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. డిజిటల్ రైట్స్ కోసం ముందుగానే ఒప్పందాలు చేసుకున్న సినిమాలు.. ఆ ఒప్పందంలో పేర్కొన్న తేదీకి థియేటర్లలో విడుదల కావాలని ఓటీటీ సంస్థలు పట్టుబడుతున్నాయి. రిలీజ్ వాయిదా పడితే ఒప్పందాన్ని రద్దు చేసుకునేంత కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పుడు బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘ఇరుముడి’ విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైనట్లు తెలుస్తోంది.
ఆగస్టు 26న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. పోటీని దృష్టిలో పెట్టుకుని ‘ఇరుముడి’ని వారం రోజుల పాటు వాయిదా వేయాలని నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ భావించారట. అయితే ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ మాత్రం రిలీజ్ వాయిదాకు అంగీకరించలేదని సమాచారం.
అగ్రిమెంట్ ప్రకారం ఆగస్టు 21నే సినిమాను థియేటర్లలో విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ స్పష్టం చేసిందట. దీంతో వేరే ఆప్షన్ లేక నిర్మాతలు అదే తేదీకి ‘ఇరుముడి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
అయితే అప్పట్లో అడ్డంకిగా కనిపించిన నెట్‌ఫ్లిక్స్ నిర్ణయమే ఇప్పుడు ‘ఇరుముడి’కి కలిసొచ్చిన అంశంగా మారింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ రెస్పాన్స్ అందుకుని భారీ విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు ఆ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టాక్సిక్’ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
ఒకవేళ ‘ఇరుముడి’ వారం రోజులు వాయిదా పడి ఉంటే.. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉండేదో చెప్పడం కష్టమే. కానీ అనుకోకుండా వచ్చిన ఈ రిలీజ్ క్లాష్నే సినిమాకు ప్లస్‌గా మారిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక థియేటర్లలో మంచి వసూళ్లతో దూసుకెళ్తున్న ‘ఇరుముడి’ డిజిటల్ రిలీజ్‌పై కూడా ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్కు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.









