కాకినాడలో నివాసముంటున్న కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తున్న టిల్లంపూడి నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవుడు కార్తీకేయలు గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం రాత్రి జరిగిన ఈఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు ఏఈ మనవడు కార్తీకేయకు ఈత రావడంతో నదిలో కొట్టుమిట్టాడుతున్న అతడిని మత్స్యకారులు రక్షించారు. ఆ తర్వాత ఏఈ మనవుడు ఇచ్చిన సమాచారంతో గజఈత గాళ్ళతో మిగిలిన ముగ్గురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా సంచలనం కలిగించే ఈ ఘటనలో విస్తుపోయే విషయాలు కూడా బయటపడ్డాయి.ఏఈ స్వయంగా రాసిన మరణ వాంగ్మూలం లేఖలో బయటపడ్డ విషయాలు చూస్తే వేధింపులే ఆ కుటుంబం ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. గత కొన్ని నెలల క్రితం ఏఈ అల్లుడు చనిపోవడంతో కుమార్తెను సాధిక్ అనే వ్యక్తి లోబరుచుకుని, బ్యాంక్ అకౌంట్ లో అన్ని అతడి ఆధీనంలో పెట్టుకునికుటుంబాన్ని వేధిస్తున్నాడని లేఖలో పేర్కొన్నాడు.అతడి మాట వినకుంటే తనను, తన మనవడు కార్తికేయను చంపుతానని బెదిరిస్తున్నానాడని, వీటన్నింటినీ తట్టుకోలేక తాము కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నామని ఏఈ లేఖలో విపులంగా తెలిపారు. ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఏఈ కుటుంబంతో సహా గోదావరిలో దూకిన ఘటనతో అధికారులు అప్రమత్తమయ్యారు.
బయటపడ్డ మనవడు కార్తికేయ ఇచ్చిన ఆనవాళ్ళతో మృతదేహాల కోసం గజఈత గాళ్ళతో గాలింపు చేపట్టారు.మరోపక్క పిఠాపురం పంచాయతీరాజ్ సిబ్బందిని,ఏఈ బంధువులను పోలీసులు విచారిస్తున్నారు.

పవన్ విచారం..సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
ఏఈ కుటుంబం బలవన్మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చావు అనేది సమస్యకు పరిష్కారం కాదన్నారు. ఏలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొవాలన్నారు. ఏఈ నూకరాజు మృతిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. ఏవరైనా సమస్య ఉంటే పోలీసులకు గాని, ఉన్నతాధికారులకు తెలియజేయాలిగాని ఇలాంటి ఆత్మహత్యలకు పాల్పడటం మంచిది కాదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మృత్యుంజయుడు మనవడు కార్తీకేయ
ఏఈ కుటుంబం గోదావరి నదిలోకి దూకిన ఘటనలో ఏఈ నూకరాజు మనువడు కార్తీకేయ బతికి బయటపడ్డ విషయం మరింత సంచలనంగా మారింది. గోదావరి ఉధృతిలో అర్ధరాత్రి సమయంలో నదిలోకి దూకిన నలుగురిలో నూకరాజు, అతని భార్య మీనా, కుమార్తె సౌజన్యలు గల్లంతయ్యారు. కాగా మనవడు కార్తీకేయ మాత్రం ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. ఇదే సమయంలో మత్స్యకారులు గమనించి బాలుడిని రక్షించారు. అంతటి ఉధృతిలో గోదావరిలో ఈత కొట్టుకుంటూ రావడం, బతకాలన్న బాలుడి ఆశ వెరసి అతడు ప్రాణాలతో బయటపడటం మరింత ఆసక్తికరంగా మారింది. 5వ తరగతి చదువుతున్న ఈ బాలుడికి ఈత రావడంతోనే ప్రాణాలతో బయటపడ్డాడని అధికారులు చెబుతున్నారు.









