తమిళనాడు రాజకీయాల్లో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదం కొనసాగుతున్న వేళ.. నటి త్రిష చేసిన సోషల్ మీడియా పోస్టులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై త్రిష నేరుగా స్పందించకపోయినా.. వరుసగా చేసిన పోస్టులతో ఆయనకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారా? అనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
తన అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను త్రిష ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. అయితే ఫొటోలతో పాటు ఆమె పంచుకున్న కొన్ని సందేశాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
“ఈ వయసులోనూ డ్రామాలు చేయడం ఏంటి? నీ పని నువ్వు చూసుకో.. డబ్బు సంపాదించుకో.. ప్రశాంతంగా ఉండు” అనే అర్థం వచ్చే మెసేజ్‌ను త్రిష షేర్ చేసింది. దానికి కనుబొమ్మ పైకెత్తిన ఎమోజీని కూడా జత చేయడంతో.. ఈ పోస్ట్ ఎవరిని ఉద్దేశించి పెట్టిందనే చర్చ మొదలైంది.
ఇక మరో పోస్టులో.. “మీరు చేసే ప్రతి పనీ తిరిగి మీ దగ్గరకే వస్తుంది. మంచిగా ఉండండి.. మంచే చేయండి” అనే సందేశాన్ని షేర్ చేసింది. అలాగే “ఇకపై మీకు అన్నీ సవ్యంగా జరిగే అధ్యాయం మొదలైంది” అనే మరో మెసేజ్‌ను కూడా తన స్టోరీలో పెట్టింది.
దీంతో పాటు “రిస్క్ తీసుకునేవారే గెలుస్తారు” అనే సందేశాన్ని, “ఒకప్పుడు కోరుకున్న జీవితంతో ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవడం ఎంత గొప్ప అదృష్టం” అనే మరో పోస్ట్‌ను కూడా త్రిష షేర్ చేసింది.
ఈ వరుస పోస్టులన్నింటినీ ఒకదానితో ఒకటి లింక్ చేస్తూ.. త్రిష ఎవరికైనా పరోక్షంగా సమాధానం ఇస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఇటీవల ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ పోస్టులు వచ్చాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అసలు వివాదం ఏంటి?
ఇటీవల కావేరీ జలాల అంశంపై తంజావూరులో జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్న సమయంలో త్రిష పేరుతో నినాదాలు వినిపించాయి. దానికి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
ఆ వ్యాఖ్యలపై రాజకీయంగా, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే త్రిష తాజాగా చేసిన పోస్టులు మరింత చర్చకు దారితీశాయి.
అయితే త్రిష మాత్రం తన పోస్టులు ఉదయనిధి స్టాలిన్‌ను ఉద్దేశించి చేసినవేనని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. కాబట్టి ఈ పోస్టులకు అసలు అర్థం ఏంటి? అవి కేవలం వ్యక్తిగత సందేశాలేనా? లేక వివాదంపై త్రిష పరోక్షంగా స్పందించారా? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉంది.
మరి ఈ పోస్టులపై త్రిష నుంచి ఏదైనా క్లారిటీ వస్తుందా? లేక సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ ఇలాగే కొనసాగుతుందా? అనేది చూడాలి.









