సినిమా ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు షూటింగ్ సమయంలో గాయపడ్డారు. వరుణ్ తేజ్, రామ్ చరణ్, బాలకృష్ణ వంటి హీరోలు గాయాల కారణంగా చికిత్స తీసుకుంటుండగా.. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఇప్పటికే రామ్ చరణ్ చేతి మణికట్టుకు సర్జరీ చేయించుకున్నారు. మరోవైపు బాలకృష్ణ కూడా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఆరోగ్య వార్త ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
గత నెల 27న ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఆయన భుజానికి గాయం అయినట్లు అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు ఎన్టీఆర్ పూర్తి విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని అప్పట్లో వెల్లడించారు.
ఎన్టీఆర్‌కు రేపే సర్జరీ
తాజాగా ఎన్టీఆర్ కార్యాలయం మరో కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల భుజానికి గాయం కావడంతో వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో ఎన్టీఆర్‌కు శస్త్రచికిత్స చేయనున్నట్లు ప్రకటించారు.
ఆగస్టు 12న ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఈ సర్జరీ జరగనుందని తెలిపారు. సర్జరీ అనంతరం ఎన్టీఆర్ కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్నారని కూడా వెల్లడించారు.
అయితే అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎన్టీఆర్ కార్యాలయం స్పష్టం చేసింది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందని, సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అధికారికంగా వెల్లడిస్తామని పేర్కొంది.
ఈ ప్రకటన బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తారక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
అసలు గాయం ఎలా జరిగింది?
గత నెల 27న ఎన్టీఆర్ భుజానికి గాయం అయిన విషయాన్ని ఆయన కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు ఆయన పూర్తిగా కోలుకోవడానికి సుమారు 6 నుంచి 8 నెలల సమయం పట్టొచ్చని, అప్పటివరకు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు అప్పట్లో ప్రకటించారు.
అయితే ఎన్టీఆర్‌కు భుజానికి గాయం ఎక్కడ జరిగింది? షూటింగ్ సమయంలో జరిగిందా? లేక మరేదైనా కారణమా? అనే విషయాలను మాత్రం ఆయన కార్యాలయం వెల్లడించలేదు.
‘డ్రాగన్’పై ప్రభావం ఉంటుందా?
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సర్జరీ చేయించుకుని కొంతకాలం విశ్రాంతి తీసుకోనున్న నేపథ్యంలో ‘డ్రాగన్’ షూటింగ్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనే చర్చ మొదలైంది. సినిమా విడుదల తేదీపై కూడా ఏమైనా మార్పులు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం మాత్రం ఎన్టీఆర్ ఆరోగ్యమే అభిమానులకు ముఖ్యంగా మారింది. సర్జరీ విజయవంతంగా పూర్తై.. తారక్ త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొనాలని అభిమానులు కోరుకుంటున్నారు.









