మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమకథ గురించి తెలిసిందే. అయితే వీరిద్దరి ప్రేమ ప్రయాణం చాలా కాలం పాటు ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా సాగింది. 2017లో ‘మిస్టర్’ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. దాదాపు ఏడేళ్ల పాటు తమ రిలేషన్‌షిప్‌ను గోప్యంగా ఉంచిన ఈ జంట.. 2023లో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
తమ ప్రేమను ఎందుకు రహస్యంగా ఉంచారనే విషయాన్ని వరుణ్ తేజ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వ్యక్తిగత జీవితంలో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. విషయం బయటకు వస్తే అనవసరమైన చర్చలు, ఊహాగానాలు తమ బంధంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావించామని తెలిపారు. తమ బంధంపై పూర్తి నమ్మకం ఏర్పడిన తర్వాతే కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పామని, మొదట తన తల్లికి చెప్పినట్లు వరుణ్ గుర్తుచేసుకున్నారు.
2023 జూన్ 8న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకోగా, అదే ఏడాది నవంబర్ 1న ఇటలీలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు కూడా తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని పూర్తిగా మద్దతు ఇచ్చారని వరుణ్ తెలిపారు. ప్రస్తుతం ఈ జంట వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఈ దంపతులకు ఓ కుమారుడు ఉన్నారు.








