ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నటుడిగా నిలిచాడు. ఈ విజయ ప్రయాణంలో అభిమానుల పాత్ర ఎంతో కీలకమని ఆయన పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి తన అభిమానులపై ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నారు.
తాజాగా హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA)కు చెందిన కీలక సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు హాజరయ్యారు. మొత్తం సుమారు 900 మంది అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు సమాచారం.
సమావేశంలో అల్లు అర్జున్ ప్రతి అభిమానిని ఆప్యాయంగా పలకరిస్తూ, వారితో మాట్లాడి, ఫొటోలు, సెల్ఫీలు దిగారు. దాదాపు ఆరు గంటల పాటు అభిమానులతోనే గడపడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎంతో కాలంగా బన్నీని కలవాలని ఎదురుచూస్తున్న తమ కోరిక నెరవేరిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మరో ప్రధాన ఆకర్షణ అభిమానుల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాజరైన అభిమానులకు బీమా పాలసీలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభిమానుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
కార్యక్రమం అనంతరం సోషల్ మీడియాలో #AlluArjun, #Bunny, #AAFA హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అయ్యాయి. అభిమానుల కోసం బీమా పథకం ప్రారంభించడం మంచి ఆలోచన అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, భవిష్యత్తులో కూడా ఇలాంటి సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అభిమానులను కలవడం, వారి అభిప్రాయాలు తెలుసుకోవడం, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే దీనిపై అల్లు అర్జున్ లేదా ఆయన బృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
హీరోగా వరుస విజయాలు అందుకోవడంతో పాటు అభిమానులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఉండటం అల్లు అర్జున్ ప్రత్యేకతగా అభిమానులు పేర్కొంటున్నారు. అభిమానుల కోసం చేపట్టిన ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.








